Jul 19,2023 22:01

డిప్యూటీ సిఎంకు ప్రజాసంఘాల వినతి

సాలూరు : పట్టణంలో నిర్మించిన రైతు బజారును వినియోగంలోకి తీసుకురావాలని కోరుతూ పట్టణ పౌర సంక్షేమ సంఘం, ఎపి గిరిజన సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. బుధవారం డిప్యూటీ సిఎం రాజన్నదొరను ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు రైతు బజారు నిర్మించి ఐదేళ్ళవుతున్నా ఇంతవరకూ దాన్ని వినియోగంలోకి తీసుకొని రాలేదని, పట్టణ ప్రజలు నిత్యావసర వస్తువుల కొనుగోలులో దోపిడీకి గురవుతున్నారని చెప్పారు. మార్కెట్లో కిలో టమాటో 150రూపాయల పైనే వుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కిలో 50రూపాయలకు పంపిణీ చేయనున్నట్లు సాలూరులోనూ విక్రయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే శాఖా గ్రంథాలయం చాలా ఏళ్ల నుంచి అద్దె భవనంలోనే నడుస్తోందని, సొంత భవనం మంజూరుకు స్థలం కేటాయించాలని కోరారు. ప్రభుత్వ ఐటిఐ కూడా గత 12ఏళ్లుగా అద్దె భవనంలో నడుస్తోందని, సొంత భవనం నిర్మాణానికి స్థలం చూపించాలన్నారు. పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ పౌర సంక్షేమ సంఘం కన్వీనర్‌ ఎన్వైనాయుడు, ఎపి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు సీదరపు అప్పారావు, మండల అధ్యక్షులు జి.జానకీరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
డిప్యూటీ సిఎంకు వినతిని అందజేస్తున్న ప్రజాసంఘాల నాయకులు