ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : రైతులకు పంట రుణాలే సరిగా పుట్టని నేపథ్యంలో వారి సేద్యపు అవసరాలతో పాటు రైతు బిడ్డల ఉన్నత, విదేశీ విద్యకు రుణాలు ఇచ్చేందుకు ముందుకొచ్చిందని గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకును (జిడిసిసిబి) రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి అభినందించారు. జగనన్న సహకార విద్యాజ్యోతి పథకం భవిష్యత్తు సమాజంలో తప్పకుండా ఒక రోల్‌మోడల్ అవుతుందని అన్నారు. రాష్ట్రంలో మరెక్కడా లేని రీతిలో జిడిసిసిబి రూపొందించిన జగనన్న సహకార విద్యాజ్యోతి పథకాన్ని బ్యాంకు ఆవరణలో మంత్రి సోమవారం ప్రారంభించారు. బ్యాంకు చైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ మానవ వనరుల అభివృద్ధిలో భాగంగా సహకార రంగం బలోపేతమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. రాష్ట్ర సహకార శాఖ సలహాదారులు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ గత పాలకుల హయాంలో సహకార రంగం పూర్తిగా నిర్వీర్యమైందన్నారు. బ్యాంకు ఛైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు మాట్లాడుతూ రైతుబిడ్డల విదేశీ విద్యకు వ్యవసాయ భూములు, వారికి సంబంధించిన స్థిరాస్తుల తనఖాపై రుణం ఇస్తున్న ఏకైక బ్యాంకు తమదేనని చెప్పారు. ఇప్పటి వరకు 20 సంఘాలకు రూ.40 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. గత మూడున్నరేళ్లలో బ్యాంకు టర్నోవర్ రూ.2200 కోట్ల నుంచి రూ.5500 కోట్లుగా వృద్ధి చెందినట్లు తెలిఆరు. బ్యాంకు సిఇఒ కృష్ణవేణి మాట్లాడుతూ ఇప్పటి వరకు ఒక్కో విద్యార్థికి రూ.30 లక్షల వరకు ఇస్తున్నామని, దీన్ని రూ.40 లక్షల వరకు పెంచుతున్నామని ప్రకటించారు. అనంతరం విదేశీ విద్యకు అర్హత పొందిన రైతు బిడ్డలకు చెక్కులను మంత్రి అందజేశారు. కార్యక్రమంలో బ్యాంకు పాలకవర్గం ఎన్.రామయ్య, కె.హరిబాబు, గోవిందనాయక్, వెంకటేశ్వరరావు, కోటేశ్వరమ్మ, ఏడుకొండలు, బ్యాంకు డీసీఓ వీరాచారి, మార్కెటింగ్ జేడీ శ్రీనివాసరావు, ఏఎంసీ సెక్రటరీ ఐవి రావు, బాలాజీ పాల్గొన్నారు.
అమరావతి మండలంలో పర్యటన
మంత్రి గోవర్ధన్‌రెడ్డి అమరావతి మండలంలో పర్యటించారు. నరుకుళ్లపాడు సొసైటీలో రైతులకు పంట రుణ పత్రాలను అందించారు. అమరావతిలోని సీడ్స్ టెస్టింగ్ సెంటర్, ఫర్టిలైజర్ టెస్టింగ్ సెంటర్, పెస్టిసైడ్స్ టెస్టింగ్ సెంటర్లను పరిశీలించారు. పొందుగలలో నర్సరీని సందర్శించారు. జూపూడిలోని రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించి రైతులకు తైవాన్స్ స్ప్రేయర్‌లను పంపిణీ చేశారు. అత్తలూరులో ఆర్గానిక్స్ కేంద్రంలో సేంద్రీయ వ్యవసాయంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే నంబూరు శంకరరావుతో కలిసి పాల్గొన్నారు. సుమారు 80 శాతం రైతులకు విత్తనాలు, ఎరువులను రైతు భరోసా కేంద్రాల ద్వారానే అందుతున్నాయన్నారు. అందుకే రైతు భరోసా కేంద్రాలు ప్రపంచంలోనే అత్యుత్తమ అవార్డుకు ఎంపికైనట్లు చెప్పారు. అనంతరం కిసాన్ క్రెడిట్ కార్డులకు సంబంధించి 3,671 రైతులకు రూ.57. 61 కోట్లు అందజేశారు. 194 స్వయం సహాయక గ్రూపులకు రూ.22.27 కోట్ల చెక్కులను అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కృష్ణా నది నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా సాగుకు నీరు అందించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. అత్తలూరుకు రూ.5 కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరైందన్నారు. కార్యక్రమంలో క్రోసూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇ.సాంబిరెడ్డి, వైసిపి నాయకులు ఎన్.విజయసాగర్‌బాబు, జెడ్‌పిటిసి ఇ.కరుణకుమారి, మండల సచివాలయ కన్వీనర్ ఎన్.రాంబాబు, బి.హనుమంతరావు పాల్గొన్నారు.










