Nov 07,2023 23:00

నమూనా చెక్కును అందజేస్తున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు

* అన్నదాతలకు అండగా ప్రభుత్వం
* రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు
* 3,21,854 మంది రైతుల ఖాతాలకు రూ.132.41 కోట్లు జమ
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
రైతులు బాగుంటేనే రాష్ట్ర ప్రగతి బాగుంటుందని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. నగరంలోని బాపూజీ కళామందిర్‌లో పిఎం కిసాన్‌-రైతుభరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడం ప్రభుత్వాల బాధ్యత అని అన్నారు. అందుకే జగన్‌ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దఎత్తున సహకారాన్ని అందిస్తోందని తెలిపారు. దేశంలో వ్యవసాయ రంగానికి విద్యుత్‌ సరఫరాలో రాయితీ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వమేనన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ పెట్టుబడి కింద ఐదేళ్లుగా రైతులకు రైతుభరోసా అందించి ఆదుకున్నట్లు తెలిపారు. జిల్లాలో 3,21,854 మంది రైతులు, కౌలు రైతులు, అటవీభూముల సాగుదారులకు 2023-24 సంవత్సరానికి రెండో విడత సాయంగా రూ.132.41 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేసినట్లు తెలిపారు. రైతుల కోసం గ్రామాల్లో రైతుభరోసా కేంద్రాలు, రైతు కార్యాలయాలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ఆధునిక పంటలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ మాట్లాడుతూ రైతుభరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు అందజేయడంతో పాటు రైతు పండించే పంట కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. భూ రీ సర్వే చేసి ప్రతి ఒక్కరికీ భూ హక్కు కల్పించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ మాట్లాడుతూ రైతులకు సకాలంలో నీరు అందించాలనే లక్ష్యంతో వంశధార, నాగావళి అనుసంధానం చేయడానికి చర్యలు చేపట్టి ముందుకు సాగుతున్నామన్నారు. అనంతరం రైతులకు నమూనా చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి, వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు నేతాజి, డిసిసిబి చైర్మన్‌ కరిమి రాజేశ్వరరావు, కళింగవైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ అంధవరపు సూరిబాబు, అగ్రి మిషన్‌ సభ్యులు గొండు రఘురాం, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌, జిల్లా ఉద్యాన అధికారి వరప్రసాద్‌, ఎల్‌డిఎం సూర్యప్రకాష్‌, రైతులు తదితరులు పాల్గొన్నారు.