ప్రజాశక్తి - మంత్రాలయం
రైతు బాధలను పట్టించుకోలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెబుదామని, కలిసి రావాలని సిపిఎం జిల్లా నాయకులు ఎమ్‌డి.అంజిబాబు, ఎమ్‌డి.ఆనంద్ బాబు, గురుశేఖర్ కోరారు. శనివారం సిపిఎం మండల కార్యదర్శి హెచ్.జయరాజు ఆధ్వర్యంలో చేపట్టిన జీపుజాతాలో వారు మాట్లాడారు. గ్రామాల్లో రైతులకు అవసరమైన నడిచే రస్తాలను పట్టించుకోవడంలో, రైతు బాధలను విస్మరించిన పాలకులకు గుణపాఠం చెప్పేలా ఉద్యమిద్దామని కోరారు. మండల అభివృద్ధిని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో జీపుజాతా చేపట్టామని తెలిపారు. మండలంలోని చిలుకలడోన, కల్లుదేవకుంట, మంత్రాలయం, మాధవరం, చెట్నహళ్లి, సూగూరు, బూదూరు, వగరూరు, మాలపల్లి, చౌళహల్లి, సుంకేశ్వరి, రచ్చుమర్రి గ్రామాల్లోని కూడళ్లలో సభలు నిర్వహిస్తూ, ప్రజలను చైతన్యం చేస్తూ ప్రభుత్వాల అలసత్వాలను వివరించారు. రహదారులన్నీ గుంతలమయంగా ఉన్నాయని పేర్కొన్నారు. తుంగభద్ర నది దగ్గర ఫిల్టర్ బెడ్ ఏర్పాటు చేసి మండల ప్రజలకు తాగునీటిని అందించాలని కోరారు. రాజకీయమంటే డబ్బు సంపాదించడం, మీసాలు దువ్వడం కాదని, ఏ ప్రాంత ప్రజలైతే నమ్మకంతో ఓటేస్తారో వారి బతుకుల బాగు కోసం కూడా పనిచేయడమని తెలిపారు. సిపిఎం నాయకులు బి.కరుణాకర్, ఆంధ్రయ్య, నరసయ్య, పెద్దయ్య పాల్గొన్నారు.
జీపుజాతానుద్దేశించి మాట్లాడుతున్న అంజిబాబు










