May 30,2021 14:33

   దేశాన్ని కరోనా పట్టి పీడిస్తోంది. తలో చెయ్యీ వేస్తేనే భారత్‌ కోలుకుంటుంది. ఇందుకోసం చాలా మంది ముందుకొస్తున్నారు. అలాంటి వారిలో ప్రవీణ్‌భారు ఒకరు. అసలు ప్రవీణ్‌ దేశం కోసం ఏం చేశాడో.. కరోనా సమయంలో ప్రజలకు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టాడో.. ప్రతిఒక్కరూ తెలుసుకోవాలి. కరోనా సెకండ్‌ వేవ్‌.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలనూ కుదిపేస్తోంది. 27 రాష్ట్రాలు కర్ఫ్యూ, లాక్‌డౌన్లు విధించాయి. ఈసారి ఆస్పత్రికి వస్తున్న కోవిడ్‌ పేషెంట్ల సంఖ్య బాగా పెరిగిపోయింది. దీంతో చాలాచోట్ల బాధితులను ఆస్పత్రులకు చేరవేసేందుకు అంబులెన్సులు దొరకట్లేదు. ఆస్పత్రుల దగ్గరా ట్రీట్‌మెంట్‌ కోసం క్యూలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో కొంతమంది అంబులెన్స్‌ నిర్వాహకులు పేషెంట్లను ఆస్పత్రులకు తీసుకెళ్లడానికి వేలకు వేలు వసూలు చేస్తున్నారు. ఒక ఆస్పత్రికి తీసుకెళ్లాక అక్కడ బెడ్‌ లేకపోతే.. మరో ఆస్పత్రికి తీసుకెళ్లడానికి అదనంగా మరిన్ని వేలు లాగేస్తున్నారు. ఇలాంటి ఘటనలు తెలుసుకొని చలించిపోయారు ప్రవీణ్‌భారు.. వీటిని చూస్తూ ఊరుకోలేకపోయారు. ప్రజలకు తన వంతుగా ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నారు.

   గుజరాత్‌ నరోడాలో నివసించే ప్రవీణ్‌భారు ఓ సాధారణ రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. వ్యవసాయం చేసుకునే రైతు అయినా.. తన వంతుగా దేశం కోసం ఏదో చేయాలని నిశ్చయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన స్కార్పియో వాహనాన్ని ఫ్రీ అంబులెన్స్‌గా మార్చేశాడు. తద్వారా ప్రజలకు, కరోనా రోగులుకు, పేదవారిని ఆస్పత్రులకు చేరవేస్తూ సేవలను కొనసాగిస్తున్నారు.
''మానవ సేవే మాధవ సేవ'' అనే సూక్తిని ఆయన బాగా నమ్ముతారు. అందుకే కరోనా ముందు కూడా తన వంతు సేవలను తన గ్రామస్తుల కోసం.. చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరిస్తూ అందరికీ సేవచేస్తున్నారు. ఇందుకోసం తన వాహనాల్లో ఒకటైన బొలేరోని గత కొన్నేళ్లుగా ఉచిత అంత్యక్రియల సేవల కోసం ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు కరోనా సెకండ్‌ వేవ్‌ రావడంతో చాలా మంది రోగులు, కరోనా బాధితులు తమ కుటుంబసభ్యులను ఆస్పత్రులకు తీసుకెళ్లే ఆర్థికస్థితి లేక నానా అవస్థలు పడుతున్నారు. వేలకు వేలు ఖర్చు పెట్టి ఆస్పత్రికి తీసుకెళ్లినా... అక్కడ బెడ్‌ ఉందో లేదో అనే డౌట్‌. తీరా లేకపోతే.. మరింత ఖర్చు చేయాల్సిన పరిస్థితి. దీన్ని భరించడం వారి వల్ల కావట్లేదు. దీంతో కొంతమంది ముందస్తుగా అంబులెన్స్‌ కోసం రిజిస్టర్‌ చేయించుకున్నా.. టైముకి అంబులెన్స్‌ రావట్లేదు. గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి.
    ఇదంతా చూసిన ప్రవీణ్‌భారు కరోనా రోగుల కోసం ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నారు. తన స్కార్పియో వాహనాన్ని అంబులెన్స్‌లా మార్చాలని డిసైడ్‌ అయ్యారు. అందుకు ఏయే మార్పులు చెయ్యాలో అన్నీ చేశారు. ఇప్పుడు రోజూ ఈ వాహనంలో అనేకమంది కరోనా రోగులను ఆస్పత్రులకు ఉచితంగా తీసుకెళ్లగలుగుతున్నారు.
 

                                                             అదే బలమైన కారణం..!

రైతు అంబులెన్స్‌ సేవలు...

   ప్రవీణ్‌భారు ఇలా చెయ్యడానికి బలమైన కారణం ఉంది. ఆయన స్నేహితుడి బంధువొకాయన కరోనాతో చనిపోయారు. ఆ అంత్యక్రియలకు ప్రవీణ్‌ హాజరయ్యారు. వేలు ఖర్చు పెట్టినా.. పేషెంట్‌ని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ టైముకు రాకపోవడంతో.. మార్గమధ్యలోనే పేషెంట్‌ చనిపోయారనీ.. డబ్బు ఖర్చు పెట్టినా ప్రాణం దక్కలేదని ఆవేదన చెందడంతో ప్రవీణ్‌భారు ఈ బలమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం నరోడా చుట్టుపక్కల ఎవరైనా ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తే.. వెంటనే ఈ స్కార్పియోపై ఉన్న ఫోన్‌ నంబర్లకు కాల్‌ చేస్తున్నారు. ఇది స్కార్పియో కావడంతో చాలా వేగంగా వెళ్తోంది. సరైన టైముకి ఆస్పత్రులకు చేరుస్తోంది. అంతేకాదు.. నరోడాకి దగ్గర్లో ఉన్న శ్మశానవాటికకు.. కట్టెలను తన ట్రక్కులో సొంత ఖర్చులతో తీసుకెళ్తున్నారు ప్రవీణ్‌భారు. తద్వారా అక్కడి స్థానిక యువతకు స్ఫూర్తిని కలిగిస్తూ, ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.