May 02,2023 21:15

చిన్న వంగలి గ్రామంలో రైతులతో చర్చిస్తున్న రైతు సంఘం జిల్లా నాయకులు ఏ రాజశేఖర్‌

రైతన్నలను ఆదుకోవాలి
- రైతు సంఘం జిల్లా నాయకులు ఎ.రాజశేఖర్‌
- దెబ్బతిన్న పంటలను రైతు సంఘం పరిశీలన
ప్రజాశక్తి - చాగలమర్రి

     అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎ.రాజశేఖర్‌, జిల్లా ఉపాధ్యక్షుడు సురేష్‌లు డిమాండ్‌ చేశారు. మంగళవారం మండలంలోని చిన్న వంగలి గ్రామంలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన నువ్వులు, కొర్రలు, అరటి తదితర పంటలను వారు పరిశీలించారు. అనంతరం చిన్న వంగలి గ్రామంలో రైతులతో నిర్వహించిన సమావేశంలో ఎ.రాజశేఖర్‌ మాట్లాడారు. అకాల వర్షాల వల్ల జిల్లా వ్యాప్తంగా పంట నష్టం జరిగి రైతులు తీవ్రంగా నష్టపోయారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పంటల బీమా వర్తింపజేయాలని, రాజకీయాలకతీతంగా పంట నష్టపోయిన రైతాంగాన్ని గుర్తించాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల రైతాంగం వాడే అన్ని రకాల విత్తనాలు, ఎరువులు, సేద్యపు ఖర్చులు విపరీతంగా పెరిగాయని, పండించిన పంటలకు మాత్రం మద్దతు ధరలు ఉండడం లేదన్నారు. ఫలితంగా రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. కావున రైతులందరూ సంఘటితంగా ఉంటేనే సమస్యలు పరిష్కారమవుతాయని, కుల, మత, రాజకీయాలకతీతంగా రైతులందరూ సంఘాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. సమావేశంలో చిన్న వంగలి గ్రామ రైతులు రామ గురువిరెడ్డి, లక్ష్మీరెడ్డి, నారాయణరెడ్డి, చల్లపు రామ గురువిరెడ్డి, వై.చంద్ర ఓబుల్‌ రెడ్డి, రామ ప్రతాపరెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.