'పదివేలు సరిపోయావో, లేవో లెక్కపెట్టి చూడు!' వందనోట్ల కట్టను కొడుకు చేతికి అందిస్తూ కుర్చీపై కూర్చున్నాడు తండ్రి.
చదువుతున్న పుస్తకాలు పక్కన పెట్టి, వందనోట్ల కట్ట లెక్కపెడుతూ 'అప్పు చేశావా నాన్నా?' అని అడిగాడు కొడుకు.
'తప్పదుగా! వ్యవసాయ పనులకు ఇంతకంటే గత్యంతరం లేదు. ముందు అప్పు చేయాలి, పంట చేతికి వచ్చాక అప్పు తీర్చాలి. ఇది ప్రతి రైతుకు ఉండే నిత్యకృత్యం' అంటూ తన నిస్సహాయతను కొడుకుకు చెప్పాడు తండ్రి.
'పదివేలు సరిపోయాయి. కానీ అప్పులు చేస్తూ వ్యవసాయం చేయడం అవసరమా నాన్నా?' కొడుకు ప్రశ్నించాడు.
'సమాజాన్ని బతికించేది వ్యవసాయం. అందరూ బాగుంటే అందులో మనమూ బాగుంటామన్నది రైతు కల' అని తన మనసులో మాట చెప్పాడు తండ్రి.
'అదెలా?' అడిగాడు కొడుకు.
'రైతు వ్యవసాయం చేయడం వలన సమాజం ఎలా అభివృద్ధి చెందుతుందో నువ్వే లెక్కించు' ఆసక్తిగా చెప్పాడు తండ్రి.
ఆశ్చర్యపోయిన కొడుకు నోరెళ్లబెట్టాడు.
'మొదట నేను అప్పు తీసుకున్న వ్యక్తికి నా వలన వ్యాపారం అయ్యిందా? లేదా? గమనించు' అన్నాడు తండ్రి.
'రైతు వలన లాభపడిన మొదటివర్గాన్ని లెక్కించాను' అన్నాడు కొడుకు.
ఇంతలో 'రేపు మేమంతా ఊడుపులకు వచ్చేస్తాం' అంటూ పదిమంది వ్యవసాయ కూలీలు వచ్చారు.
'డబ్బులు సిద్ధమయ్యాయి అలాగే వచ్చేయండి!' అన్నాడు తండ్రి.
'మీరు వ్యవసాయం చేయబట్టే వీళ్ళకు ఉపాధి దొరికింది. అంటే రెండో వర్గానికి సాయం చేశారు' అంగీకరించాడు కొడుకు.
ఇంతలో ఎరువుల దుకాణం నుండి కబురొచ్చింది.
'వ్యవసాయం చేయబట్టే ఎరువుల దుకాణానికి వ్యాపారం అవుతుంది. మూడో వర్గం బతుకుదెరువుకి వ్యవసాయదారుడే కారణమని ఒప్పుకుంటాను' అన్నాడు కొడుకు.
'షావుకారికి ధాన్యం ఇచ్చారు. ఇంకా బియ్యం పంపించలేదు. వెళ్ళి కనుక్కోండి!' అంటూ కేకేసింది ఇంటిలోపల నుంచి అమ్మ.
'మర పట్టించాడో లేదో కనుక్కోవాలి!' అంటూ కొడుకును పురమాయించి, షావుకారు దగ్గరకు పంపించాడు తండ్రి.
షావుకారు దగ్గరకు వెళ్ళిన కొడుకు కొద్దిసేపటికి తిరిగి వచ్చి, 'మిల్లు ఆడించడానికి మిల్లు డ్రైవర్ రాలేదు. రేపు వస్తే బియ్యం ఇస్తామన్నాడు' చెప్పాడు కొడుకు.
'నేను పండించిన పంట ఎవరెవరికి పని కల్పించిందో అర్థమయ్యిందా?' అడిగాడు తండ్రి.
'నాలుగో వర్గాన్ని లెక్కించాను' సమాధానమిచ్చాడు కొడుకు.
'ఈ పూటకు అన్నం వండడానికి బియ్యం లేవు హోటల్‌కి వెళ్దామా?' అడిగింది తల్లి.
'అలాగే!' తల ఊపాడు తండ్రి.
'ఐదో వర్గం బతుకుదెరువుకి రైతే కారణం. సమాజంలో రైతు పండించిన పంట ఇంతమందికి పని కల్పించి, బతుకుదెరువు చూపిస్తుంది. రైతు సమాజానికి వెన్నెముక అని చెప్పడంలో తప్పులేదు. వ్యవసాయం చేస్తూ సమాజాన్ని బతికిస్తున్న రైతు ''మానవ సేవే మాధవ సేవ'' అంటూ నిస్వార్థంగా బతుకుతున్నాడు. వ్యవసాయాన్ని బతికించాలి' ఒప్పుకున్నాడు కొడుకు.
- బి.వి.పట్నాయక్, 9441349275