ఇప్పుడు జరుగుతున్న రైతుల పోరాటం సామాన్యమైనదేమీ కాదు. ఏవో కొన్ని ఆర్థిక కోర్కెలకే పరిమితమైన పోరాటం కాదిది. ఇచ్చిపుచ్చుకునే పద్ధతిలో చర్చలు జరిపి పరిష్కరించుకునేది కాదు. ప్రభుత్వం ప్రజలవైపు ఉన్నదో, లేక అంతర్జాతీయ బడా పెట్టుబడి వైపు ఉన్నదో బాహాటంగా ప్రకటించాల్సిన తప్పనిసరి పరిస్థితిని ఈ పోరాటం కల్పిస్తున్నది. ఇంతవరకూ ఈ ప్రభుత్వం అంతర్జాతీయ బడా పెట్టుబడి వైపే నిలిచి వ్యవహరిస్తోంది. అదే విషయాన్ని ఇక ఈ ప్రభుత్వం బాహాటంగా కూడా ప్రకటిస్తే అంతకన్నా ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి పెద్ద విఘాతం మరొకటి ఉండదు.
మారుతున్న కాలంతోబాటు పెట్టుబడిదారీ విధానం మారుతున్నట్టే మార్క్సిస్టు సిద్ధాంతం కూడా కాలంతోబాటు పెంపొందుతూ వుంటుంది. అందుకే అదొక సజీవమైన సిద్ధాంతం. పెట్టుబడిదారీ విధానాన్ని అధిగమించి ముందుకు పోయే విప్లవ క్రమంలో రైతాంగం నిర్వహించే పాత్ర గురించి మార్క్సిస్టు సిద్ధాంతంలో గణనీయంగా మార్పులు చోటు చేసుకున్నాయి. వాటిని నేనిప్పుడు చర్చిస్తాను.
''జర్మనీలో రైతాంగ పోరాటం'' అన్న గ్రంథంలో ఫ్రెడరిక్ ఎంగెల్స్ పెట్టుబడిదారీ విధానాన్ని విప్లవం ద్వారా అంతం చేయాలంటే కార్మిక వర్గం రైతులలో వివిధ తరగతులతోను, వ్యవసాయ కార్మికులతోను సంఘటన నిర్మించాల్సిన అవసరాన్ని గురించి నొక్కి చెప్పాడు. ఐనప్పటికీ, విప్లవంలో రైతాంగం పాత్ర ఏమిటి అన్న విషయంమీద మార్క్సిజం చాలా కాలం వరకూ అస్పష్టంగానే ఉంది. రెండవ ఇంటర్నేషనల్ యొక్క ప్రధాన సిద్ధాంతకర్త కార్ల్ కాట్‌స్కీ. ఎడ్వర్డ్ బెర్న్‌స్టీన్ యొక్క రివిజనిజానికి వ్యతిరేకంగా పోరాడి మార్క్సిస్టు సిద్ధాంత విప్లవకర స్వభావాన్ని నిలబెట్టినవాడు కార్ల్ కాట్‌స్కీ. ఆ కాట్‌స్కీ కూడా ''రైతులకు భూస్వాములకు నడుమ సంబంధాల విషయంలో పట్టణ విప్లవోద్యమం (కార్మిక వర్గం) తటస్థంగా ఉండాలని'' భావించాడు. ఈ విషయాన్ని నదెజ్డా కృపస్కయా తన గ్రంథం ''లెనిన్ జ్ఞాపకాలు''లో పేర్కొన్నది. ''కాట్‌స్కీ తీసుకున్న ఈ వైఖరితో లెనిన్ ఇబ్బంది పడ్డాడు. కాట్‌స్కీ చెప్పినది పశ్చిమ యూరప్ దేశాలలో ఉన్న సంబంధాలరీత్యా ఆ వరకూ సబబే అయివుండవచ్చునని సర్ది చెప్పుకుని రష్యా విప్లవం వరకు వచ్చేసరికి మాత్రం విప్లవం రైతాంగంతో సంఘటన ఏర్పరచుకుంటేనే సాధ్యపడుతుందని లెనిన్ భావించాడు'' అని కృపస్కయా తెలిపింది.
ఎంగెల్స్ చేసిన ప్రతిపాదన నుండే మొదలుబెట్టి లెనిన్ ఈ విషయంలో రూపొందించిన వైఖరి ఆ తర్వాత శతాబ్దం పాటు మౌలిక మార్క్సిస్టు వైఖరిగా కొనసాగింది. లెనిన్ వాదన ఈ విధంగా ఉంది : పెట్టుబడిదారీ విధానం ఆలస్యంగా మొదలైన దేశాలలో, అప్పటికే కార్మికవర్గం నుండి సవాలు ఎదుర్కొంటున్న పెట్టుబడిదారులు ఫ్యూడల్ భూస్వాములతో పొత్తు కలిపారు. భూస్వాముల ఆస్థిపై దాడి జరిగితే, ఆ తర్వాత ఆ దాడి పెట్టుబడిదారుల ఆస్థి మీదకు కూడా విస్తరించవచ్చునని వారు భయపడ్డారు. అంతకు ముందు దశలో ఈ పెట్టుబడిదారులే భూస్వాముల ఆస్థిహక్కుపై చావుదెబ్బ తీశారు. 1789లో ఫ్రాన్స్‌లో జరిగిన బూర్జువా విప్లవంలో ఈ విధంగానే చేశారు. ఐతే ఆ తర్వాత దశలో (పెట్టుబడిదారీ విధానం ఆలస్యంగా మొదలైన దేశాలలో) భూస్వాముల భూములను రైతాంగానికి పంపిణీ చేసి ఆ భూస్వాముల సామాజిక శక్తిని దెబ్బ తీసేవిధంగా వ్యవహరించడం మానుకున్నారు. దాని వలన రైతాంగపు ప్రజాతంత్ర డిమాండ్లు నెరవేరకుండా అలానే ఉండిపోయాయి. ఆ రైతాంగపు ఆకాంక్షలు నెరవేరాలంటే అది కార్మికవర్గ నాయకత్వాన నడిచే ప్రజాతంత్ర విప్లవం ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. అందుకే ఆ విప్లవంలో కార్మికవర్గం రైతాంగాన్ని తన మితృడుగా కలుపుకోవాలి.
అందుచేత కార్మికవర్గ నాయకత్వాన ప్రజాతంత్ర విప్లవం సంపూర్ణంగా జయప్రదం కావాలంటే కార్మిక-కర్షక ఐక్య సంఘటన అవసరం అని లెనిన్ ప్రతిపాదించాడు. అక్కడి నుంచి కార్మికవర్గం సోషలిస్టు విప్లవం సాధించాలన్న తన లక్ష్యం దిశగా ముందుకు సాగాలి. ఆ విప్లవ దశకు అనుగుణంగా రైతాంగం లోని వివిధ తరగతులలోని తన మితృలను ఎంపిక చేసుకుంటూ, తదనుగుణంగా సంఘటనను మార్చుకుంటూ కార్మికవర్గం ముందుకు పోవాలి. మెన్షివిక్ ప్రతినిధులు ప్రజాతంత్ర విప్లవం విజయవంతం కావాలంటే కార్మికవర్గం ఉదారవాద బూర్జువా వర్గంతో (లిబరల్ బూర్జువాయిజీ) సంఘటన కట్టాలని వాదించారు. ఆ ఉదారవాద బూర్జువా వర్గం భూస్వామ్య వర్గంతో విడగొట్టుకోడానికి సిద్ధపడదని, అందుచేత అది రైతాంగానికి ద్రోహం చేస్తుందని, కనుకనే కార్మికవర్గం రైతాంగంతో సంఘటన ఏర్పరచుకోవాలని, అప్పుడే ప్రజాతంత్ర విప్లవం విజయం సాధించగలుగుతుందని లెనిన్ అన్నాడు. ఉదారవాద బూర్జువా వర్గంతో సంఘటన కడితే తన కాళ్ళకు కార్మికవర్గం తానే బంధాలు వేసుకున్నట్టు అవుతుందని, ప్రజాతంత్ర విప్లవం పూర్తి కాకుండా మధ్యలోనే నిలిచిపోతుందని వివరిస్తూ లెనిన్ మెన్షివిక్కుల వాదనను ఖండించాడు.
ప్రజాతంత్ర విప్లవం విజయవంతంగా పూర్తి కావాలంటే కార్మిక-కర్షక ఐక్య సంఘటన ద్వారా మాత్రమే సాధ్యం. అదే ఉదారవాద బూర్జువా వర్గంతో ఐక్య సంఘటన కడితే ఆ ప్రజాతంత్ర విప్లవానికి ద్రోహం జరుగుతుంది. అందుకే విప్లవానికి ముందు బోల్షివిక్ పార్టీ తన కార్యక్రమంలో ''కార్మిక-కర్షక ప్రజాతంత్ర నియంతృత్వం'' (డెమోక్రటిక్ డిక్టేటర్‌షిప్ ఆఫ్ ది వర్కర్స్ అండ్ పెజెంట్స్) అని పేర్కొని, ఆ తర్వాత అది ''శ్రామికవర్గ నియంతృత్వం''గా పరిణామం చెందుతుందని ప్రకటించింది.
ఆ తర్వాత శతాబ్దకాలం పాటు మూడవ ప్రపంచ దేశాలలోని విప్లవోద్యమాలకు ఈ అవగాహనే మార్గదర్శిగా ఉంది. లెనిన్ అనంతర కాలంలో జరిగిన వివిధ పరిణామాలు లెనిన్ విశ్లేషణ ప్రాధాన్యతను, కార్మిక-కర్షక ఐక్య సంఘటన ప్రాధాన్యతను మరింతగా బలపరిచేలా ఉన్నాయి. లెనిన్ వివరించిన కారణాలే గాక మరికొన్ని ఇతర కారణాలు కూడా తోడై ఈ ప్రాధాన్యతను నొక్కి చెప్తున్నాయి.
అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆధిక్యత పెరిగి దాని పెత్తనం కింద నయా ఉదారవాద విధానాలు మొదలవడంతో రైతాంగ వ్యవసాయంలోకి దేశీయ, అంతర్జాతీయ బడా పెట్టుబడి చొరబడడం పెరిగింది. అంటే నేటి రైతాంగం భూస్వామ్య వర్గం నుంచి మాత్రమే కాక గుత్తపెట్టుబడి నుంచి కూడా దోపిడీని, అణచివేతను ఎదుర్కొంటున్నారు.
మామూలుగా స్వేచ్ఛా మార్కెట్ విధానంలో, పెట్టుబడిదారులు తమలో తాము పోటీ పడిన కాలంలో వచ్చిన మామూలు స్థాయి లాభాలకన్నా సూపర్ లాభాలు గుత్త పెట్టుబడి (తమలో తాము పోటీ పడే స్థితి లేకుండా పోయినప్పుడు) ఆర్జిస్తుంది. అదనపు విలువ రేటును పెంచడం ద్వారా కార్మికుల నుండి దోచుకోవడమే కాకుండా చిన్న పెట్టుబడిదారులను, రైతులను, ఇతర చిన్న ఉత్పత్తిదారులను సైతం దోచుకుంటుంది. వ్యాపారం యొక్క నియమాలను తమ వర్గానికి అనుకూలంగా మార్చుకోవడం, అందుకోసం ప్రభుత్వాన్ని ఒక సాధనంగా వినియోగించుకోవడం ద్వారా ఈ దోపిడీ సాగుతుంది. ఉదాహరణకు: ఇంతవరకూ రైతులకు ఇచ్చిన సబ్సిడీలను తగ్గించి ఆ మొత్తాన్ని రాయితీగా గుత్త పెట్టుబడిదారులకు ప్రభుత్వం అందిస్తున్నది. ఒకవైపు గుత్త పెట్టుబడిదారుల రాయితీలను పెంచి ఇంకోవైపు రైతులకు మద్దతు ధరలను గ్యారంటీ చేయడానికి నిరాకరించితే రక్షణ లేని ఆ రైతులు తమ ఉత్పత్తులను ఆ గుత్త పెట్టుబడిదారులకే చౌకగా తెగనమ్ముకోవలసి వస్తుంది. ఆ విధంగా గుత్త పెట్టుబడిదారులు సూపర్ లాభాలనార్జిస్తారు.
ఈ విధంగా రైతుల వైపు నుండి సంపదను తమ వైపుకు మళ్ళించడం ద్వారా మాత్రమే ఈ దోపిడీ సాగుతుందనుకోరాదు. ఆస్థులపై ఆధిపత్యాన్ని కూడా రైతుల నుండి తమ వైపుకు లాక్కుంటారు. నిజానికి ఈ రెండు రకాల పద్ధతులూ ఒకదానితో ఇంకొకటి ముడిపడే వుంటాయి. అంతిమ ఫలితంగా రైతాంగ వ్యవసాయం చితికిపోయి వారు పట్టణాలకు జీవనోపాధిని వెతుక్కుంటూ వలసలు పోతారు.
నయా ఉదారవాద విధానాలలో భాగంగా సాంకేతిక పరిజ్ఞానం దిగుమతిపై అంతవరకే ఉండే ఆంక్షలు తొలగిపోయిన కారణంగా అభివృద్ధి జరిగినా దాని వలన ఉపాధి కల్పన వృద్ధి రేటు తగ్గిపోతుంది. ఒకవైపు జిడిపి వృద్ధి రేటు పెరుగుతున్నా, ఉత్పాదకత వృద్ధి రేటు ఎంతగా పెరుగుతుందంటే ఉపాధి కల్పన వృద్ధి బాగా మందకొడిగా సాగుతుంది. ఇక జిడిపి వృద్ధి రేటు గనుక తగ్గిపోతే ఉపాధి కల్పన సమస్య ఇంకా తీవ్రమౌతుంది.
ఒకపక్క దివాలా తీసిన, చితికిపోయిన రైతాంగం పట్టణాలకు ఉపాధి నిమిత్తం వలస పోతుంటే, వారిని ఇముడ్చుకునే విధంగా ఆర్థిక వృద్ధి ఉండదు సరికదా నిరుద్యోగ సైన్యం మాత్రం పెరిగిపోతుంది. అసలే యూనియన్లలో ఉండే కార్మికుల శాతం తగ్గిపోయింది. ఇప్పుడు ఈ అదనపు నిరుద్యోగ సైన్యం పెరిగిపోయినందు వలన ఆ యూనియన్లలో ఉండే కార్మికుల బేరసారాల శక్తి కూడా దెబ్బతింటుంది. పెరిగిపోతున్న నిరుద్యోగాన్ని పంచుకోవడంలో వీరంతా పోటీ పడతారు. కొద్దిపాటి పని ఎక్కువ మంది మధ్య పంచుకోవలసి వస్తుంది. ఈ విధంగా చిన్నరైతు వ్యవసాయాన్ని దెబ్బ తీయడం మొత్తం శ్రామిక ప్రజలందరి జీవన పరిస్థితులనూ మరింత దిగజారుస్తుంది.
ఈ కారణంగా కార్మిక-కర్షక ఐక్య సంఘటన ప్రాధాన్యత మరింతగా పెరిగింది. ప్రస్తుతం ఉన్న గుత్త పెట్టుబడిదారీ దశను దాటుకుని ముందుకు పోవాలంటే ఈ సంఘటన తప్పనిసరి. గుత్త పెట్టుబడిదారీ దశను దాటుకుపోవడం అంటే మళ్ళీ ఎప్పుడో గతించిపోయిన కాలానికి వెనక్కు మళ్ళడం కాదు. మొత్తం పెట్టుబడిదారీ దశనే దాటి నూతన వ్యవస్థ వైపు సాగడం.
ఈ కోణం నుండి చూసినప్పుడు ప్రస్తుతం భారతదేశంలో సాగుతున్న రైతాంగ ఉద్యమం ఒక నిర్ణయాత్మక ప్రాధాన్యతను కలిగివుంది. గుత్త పెట్టుబడి చొరబాటుకు దారులు తెరిచి చిన్న రైతు వ్యవసాయాన్ని దెబ్బతీసేవిగా ఆ మూడు నల్ల వ్యవసాయ చట్టాలూ ఉన్నాయి గనుకనే రైతులు వాటికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఈ చట్టాలు తెచ్చేకన్నా ముందు మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను తెచ్చింది. ఆ చట్టాలు కార్మికుల సంఘటిత శక్తిని దెబ్బ తీసి వారిపై సాగే దోపిడీ తీవ్రతను పెంచుతాయి. అందుచేత నేటి ప్రపంచంలో కార్మిక-కర్షక ఐక్యత కేవలం భూస్వామ్య విధానంపై సాగే పోరులో విజయం సాధించడానికి మాత్రమే కాదు. కార్మికవర్గం భవిష్యత్తు నేడు విడదీయలేనంతగా రైతాంగం భవిష్యత్తుతో పెనవేసుకు పోయి వుంది. ఈ రెండు వర్గాలూ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి యొక్క, దాని భాగస్వామి అయిన దేశీయ గుత్త పెట్టుబడి యొక్క బాధితులుగా ఉన్నారు.
అందుచేత ఇప్పుడు జరుగుతున్న రైతుల పోరాటం సామాన్యమైనదేమీ కాదు. ఏవో కొన్ని ఆర్థిక కోర్కెలకే పరిమితమైన పోరాటం కాదిది. ఇచ్చిపుచ్చుకునే పద్ధతిలో చర్చలు జరిపి పరిష్కరించుకునేది కాదు. ప్రభుత్వం ప్రజలవైపు ఉన్నదో, లేక అంతర్జాతీయ బడా పెట్టుబడి వైపు ఉన్నదో బాహాటంగా ప్రకటించాల్సిన తప్పనిసరి పరిస్థితిని ఈ పోరాటం కల్పిస్తున్నది. ఇంతవరకూ ఈ ప్రభుత్వం అంతర్జాతీయ బడా పెట్టుబడి వైపే నిలిచి వ్యవహరిస్తోంది. అదే విషయాన్ని ఇక ఈ ప్రభుత్వం బాహాటంగా కూడా ప్రకటిస్తే అంతకన్నా ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి పెద్ద విఘాతం మరొకటి ఉండదు.
( స్వేచ్ఛానుసరణ )
ప్రభాత్ పట్నాయక్











