Oct 07,2023 21:33

ప్రజాశక్తి - చింతలపూడి
             రైతాంగ సమస్యల పరిష్కారానికి పోరాటమే మార్గమని ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ నరసింహ, జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ అన్నారు. చింతలపూడి మండలం రాఘవాపురం శివారు అంకులయ్య కొత్తగూడెంలో రైతు సంఘం ఆధ్వర్యంలో శనివారం రైతు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీ నాయకులు చీకటి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథులుగా విచ్చేసిన నరసింహ, శ్రీనివాస్‌ మాట్లాడుతూ రైతాంగ సమస్యల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. రైతులు సంఘటిత పోరాట ఫలితంగా గ్రీన్‌ హైవే భూ నిర్వాసిత రైతులకు పరిహారం పెరిగిందని చెప్పారు. అయితే రైతులకు పూర్తి న్యాయం జరగలేదన్నారు. గ్రీన్‌ ఫీల్డ్‌ హైవేలో సర్వీస్‌ రోడ్లు నిర్మించాలని కోరారు. గ్రీన్‌ ఫీల్డ్‌ హైవేలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం, అధికారులు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయిల్‌ పామ్‌ గెలల ధర దారుణంగా పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది టన్ను ఆయిల్‌ పామ్‌ గెలల ధర రూ.23 వేలు ఉంటే ప్రస్తుతం రూ.12,900కు పడిపోయిందన్నారు. టన్ను గెలలకు రూ.18 వేలు ప్రకటించాలని కోరారు. కొబ్బరి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, కొబ్బరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ధాన్యం క్వింటాల్‌కు రూ.500 రాష్ట్ర ప్రభుత్వం బోనస్‌ ఇవ్వాలని, ధాన్యం కొనుగోలు సమస్యలు పరిష్కరించాలన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తి చేసి మెట్ట ప్రాంత రైతులకు సాగునీరందించాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 12, 13 తేదీల్లో ఏలూరులో జరిగే రైతు సంఘం జిల్లా స్థాయి శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎపి రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు గంటా పాపారావు, అనుమోలు మురళీ, రైతులు చీకటి వెంకటేశ్వరరావు, జి.సీతారామయ్య, మట్టా సత్యనారాయణ, చీకటి ఉమారాణి, కరెడ్ల అన్నం, జి.కృష్ణయ్య, సిహెచ్‌.శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు.