ప్రజాశక్తి-రేపల్లె: ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా 2018లో మోసం చేసిన రైస్ మిల్లర్‌పై చర్యలు తీసుకోవాలని, రైతుల కు రావలసిన డబ్బులు వెంటనే చెల్లించే విధంగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని ఏపి రైతుసంఘం ఆధ్వర్యంలో బాధిత రైతులు స్థానిక డీఎస్పీ మరియు ఆర్డీఓ కి రైస్ మిల్లర్ కస్తూరి రాధాకృష్ణమూర్తిపై చర్యలు తీసుకోవాలని, రైతులకి డబ్బులు చెల్లించాలని వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రేపల్లె డిఎస్‌పి, ఆర్‌డిఒ ఆఫీసుల వద్ద రైతులు నిర్వహించిన ఆందోళనలో రైతుసంఘం బాపట్ల జిల్లా అధ్యక్షులు వేములపల్లి వెంకటరామయ్య మాట్లాడుతూ రైతుల దగ్గర 2018లో రైస్ మిల్లు నిర్వహించిన కస్తూరి రాధాకృష్ణమూర్తి ధాన్యం కొనుగోలు చేసి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ డబ్బులు ఇవ్వకుండా మోసం చేయటంతో రైతులు నాలుగు సంవత్సరాల కాలం నుంచి రైస్ మిల్లు యాజమాని మీద పోలీస్ వారికి, జిల్లా కలెక్టర్‌కు, ఇతర అధికారుల దృష్టికి పలు దఫాలు తీసుకువెళ్లినా రైస్ మిల్ యజమాని మీద ఒత్తిడి చేసి మోసపోయిన రైతులకు డబ్బు లు జమ చేయకపోవటం అంటే ఉద్దేశపుర్వకంగా జాప్యం జరిగిందని విమర్శించారు. మోసపోయిన రైతులు అప్పులకు వడ్డీలు చెల్లించలేక తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటే రైస్ మిల్ యజమాని దర్జాగా తిరుగుతున్నాడని, వెంటనే జాయింట్ కలెక్టర్ స్థాయిలో ధాన్యం అమ్మినటువంటి రైతుల లిస్టు తయారుచేసి డబ్బులు జమ చేయించాలని, లేని పక్షంలో రైతుసంఘంగా ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మద్దతుగా పాల్గొన్న సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ రైతుల దగ్గర కొనుగోలు చేసిన ధాన్యానికి 2019 నవంబర్‌లో లెక్క తేల్చగా సుమారు కోటి రూపా యలు వరకు తేలిందని, 2020 జనవరి నాటికి ప్రతి రూపాయి ఇస్తానని పోలీస్ స్టేషన్లో ఒప్పుకొని రైస్ మిల్లు యజమాని నేటికీ డబ్బులు చెల్లించకపోవడం వల్ల, చిన్న రైతులు, కౌలు రైతులు లక్షలాది రూపాయలు డబ్బులు రాక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కరోనా కాలంలో డబ్బులు లేక మోసపోయిన రైతుల్లో ఇద్దరు మానసిక ఆందోళనతో ప్రాణాలు కోల్పోయారని అన్నారు. అయినప్పటికీ రైస్ మిల్ యజమాని డబ్బులు చెల్లించలేదని అన్నారు. రైతులకు డబ్బులు చెల్లించేవరకు రైతు, కౌలురైతు సంఘాలు నిర్వహించే ఆందోళనకు సిపిఎం పార్టీ మద్దతు ఉంటుందని అన్నారు. బాధిత రైతులు కే కోటేశ్వరరావు, టి నరసింహారావు, కే మహేష్, కె వాసు, ఆర్ వెంకటేశ్వరరావు, కే హనుమంత్, రైతు, కౌలు రైతు సంఘాల నాయకులు బి సుబ్బారావు, కె ఆశీర్వాదం, కే రమేష్ పాల్గొన్నారు.










