Dec 20,2022 22:23

ప్రజాశక్తి - నూజివీడు
          ఆరుగాలం కష్టించి వరి పండించిన రైతులను రైస్‌ మిల్లర్లు దోచుకుంటున్నారని, ధాన్యం సేకరణ సమయంలో కొత్త నిబంధనలతో వారిని ఇబ్బందులకు గురిచేస్తూ కష్టాన్ని కాజేస్తున్నారని ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ నరసింహ విమర్శించారు. మంగళవారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో మిల్లర్ల దోపిడీ అరికట్టాలంటూ రైతులు సబ్‌ కలెక్టర్‌ ఆదర్స్‌ రాజేంద్రకు వినతిని అందజేశారు. ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణంలో విలేకరులతో నరసింహ మాట్లాడారు. ఇ-క్రాప్‌లో నమోదైన పంట మరొకటంటూ మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. రైతుభరోసా కేంద్రాల్లో తేమ శాతాన్ని పరిశీలించిన తర్వాత మరోసారి పరిశీలించకూడదనే నిబంధన ఉన్నప్పటికీ, దాన్ని ఉల్లంఘిస్తూ ధాన్యంలో తేమ శాతం అధికంగా ఉందనే సాకుతో మిల్లర్లు ధరను బాగా తగ్గిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు ప్రాంతాలకు దగ్గరలో అధికారులు వే బ్రిడ్జిలను ఏర్పాటు చేసి రైతులకు రవాణా భారాన్ని తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రైతులు అమ్మిన పంటకు డబ్బులు త్వరగా జమయ్యేలా అధికారులు చొరవ తీసుకోవాలని సబ్‌కలెక్టర్‌ను కోరారు. వినతిపత్రం అందించిన వారిలో రైతుసంఘం మండల కార్యదర్శి బి.రాంబాబు, పాపారావు పాల్గొన్నారు.