Jul 03,2023 23:54

ప్రజాశక్తి - నకరికల్లు : రైల్వే ట్రాక్‌పై అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన మండల కేంద్రమైన నకరికల్లులో సోమవారం జరిగింది. పోలీసులు, మృతుని బంధువుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఎర్రంశెట్టి మల్లికార్జునరావు (23) భవన నిర్మాణ పనులు చేస్తుంటాడు. ఆదివారం ఇంటి నుండి వెళ్లిన మల్లికార్జునరావు తిరిగి రాలేదు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున స్థానిక నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైన్‌ పరిసరాల్లో వాకింగ్‌ కోసం వచ్చిన వారు ట్రాక్‌పక్కన మృతదేహాన్ని గమనించారు. వెళ్లి పరిశీలించగా మృతుడు మల్లికార్జునరావుగా తేలింది. మృతదేహంపై గాయాలు ఉండడం, శరీరంపై మట్టి, పక్కనే ద్విచక్ర వాహనం పడేసి ఉండడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు నరసరావుపేట రైల్వే పోలీస్‌ ఇన్‌ఛార్జి బి.పూర్ణమహేశ్వరరావు తెలిపారు. ఇదిలా ఉండగా మృతునికి ఒక సోదరుడు ఉన్నాడు. తండ్రి నెల మేనెలలోనే చనిపోయాడు.