Jul 25,2023 17:39

ప్రజాశక్తి - మండవల్లి
        రైల్వే స్థలాలను ఆక్రమించుకొని ఇళ్లు నిర్మించుకోవడం చట్టరీత్యా నేరమని రైల్వే లీగల్‌ సెల్‌ ఫణి మోహన్‌ స్పష్టం చేశారు. మండలంలోని పుట్ల చెరువులో రైల్వే స్థలాలను ఆక్రమించుకున్న ఆక్రమణదారులతో మంగళవారం మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే స్థలాలను ఆక్రమించడం అనేది ఎప్పటికైనా ప్రమాదమే అని అన్నారు. ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్న, భవంతులు కట్టుకున్న ఎప్పటికైనా కూల్చేయడం తప్పనిసరి అన్నారు. ఇప్పటికే మండవల్లి తదితర ప్రాంతాలలో పూర్తిస్థాయిలో ఆక్రమణను తొలగించడం జరిగిందని తెలిపారు. ఎవరికి వారే స్వచ్ఛందంగా తొలగించుకుంటే ఆస్తులకు భంగం కలగకుండా ఉంటుందని ఆక్రమణదారులకు ఆయన తెలియజేశారు. దీంతో స్పందించిన ఆక్రమణదారులు తామే తమ నివాసాలను తొలగించుకుంటామని చెప్పడంతో పాటు మంగళవారం పూర్తిస్థాయిలో వారే ఆక్రమించుకుని ఇళ్లను ఖాళీ చేసి కూల్చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రైల్వే పోలీస్‌ సిబ్బంది, రైల్వే సిబ్బంది పాల్గొన్నారు.