Sep 25,2023 00:13

ప్రజాశక్తి -సామర్లకోట రూరల్‌ తమ సమస్యలపై విజయవాడ అలంకార్‌ సెంటర్లో సోమవారం చేపట్టిన మహా ధర్నాకు వెళుతున్న సుమారు 70 మంది అంగన్‌వాడీ కార్యకర్తలను ఆదివారం రాత్రి సామర్లకోట రైల్వే స్టేషన్‌లో పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారిని ఆటోలో సామర్లకోట పోలీస్‌ స్టేషన్‌ తరలించారు. పోలీస్‌ స్టేషన్‌ ఎదుట అంగన్వాడీలు కొంతసేపు ధర్నా చేశారు. రాత్రి ఎనిమిది గంటలకు సొంత పూచీకత్తుపై వదిలేశారు. పెదబ్రహ్మదేవం, వేట్లపాలెం, సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం, ప్రత్తిపాడు తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 70 మంది అంగన్వాడీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆందోళనలో ఈ ఆందోళనలో అంగన్వాడి కార్యకర్తలు సత్యవతి, భారతి, కనక, చింతామణి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీలపై నిర్బంధాలను ఆపండి
పెద్దాపురం తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్యయుతంగా ఆందోళనలు చేస్తున్న అంగన్వాడీలను అక్రమంగా నిర్బంధించటం అన్యాయమని సిఐటియు మండల కమిటీ తీవ్రంగా ఖండించింది. ఆదివారం సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు గడిగట్ల సత్తిబాబు, దారపురెడ్డి క్రాంతి కుమార్‌ మాట్లాడుతూ అంగన్వాడీలు తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఈ నెల 25న తలపెట్టిన ధర్నాను విఫలం చేయడానికి ప్రభుత్వం పోలీసులతో నిర్బంధాలకు, అరెస్టులకు పాల్పడటం అన్యాయమన్నారు. ఈ ధర్నాకు వెళ్లకుండా ఇళ్ల వద్దనే అంగన్వాడీలను అరెస్టు చేయడం, నిర్బంధించడం, వాహనాలను అడ్డుకోవడం, ధర్నాకు అనుమతి ఇవ్వకపోవడం అప్రజాస్వామికమన్నారు. రైల్వే స్టేషన్‌ నుంచి మహిళలను పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లి నిర్బంధించడం దుర్మార్గమన్నారు. అంగన్‌వాడీల న్యాయమైన కోర్కెలను వెంటనే ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారానికి అంగన్వాడీలు చేస్తున్న పోరాటానికి సిఐటియు మద్దతు ప్రకటించింది.