ప్రజాశక్తి - సీతానగరం : మండల కేంద్రంలోని సీతానగరం రైల్వే స్టేషన్ నుంచి ప్రధానరోడ్డుకు గల రహదారి పూర్తిగా గుమ్ములు, గోతులతో కూడి ఉన్నందున రాత్రిపూట రైలు దిగే ప్రయాణికులు వెళ్తున్న సమయంలో గోతుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నడిచే వెళ్లేవారు, ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారంతా కేవలం 500మీటర్ల దూరం వెళ్లడానికి నరకం చూస్తున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు గోతుల్లో నీరు పెద్ద ఎత్తున చేరి ఉండటంతో గత మూడు రోజులుగా అనేక మంది ద్విచక్ర వాహన చోదకులు జారిపడి ప్రమాదాలకు గురయ్యారు. మూడో రైల్వే లైన్ పనుల వల్ల స్టేషన్‌కు ఉండే బిటి రోడ్డును కప్పివేయడం, గుమ్ములు, గోతులతో రోడ్లు ఉండడంతో ఎలా వెళ్లాలని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. అధిక ఆదాయం కలిగే రైల్వేలో రోడ్లు ఇలా ఉండడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడే మెటీరియల్, పనిచేసే మనుషులు పెద్దఎత్తున ఉన్నా రోడ్డును ఎందుకు మరమ్మతులు చేయడం లేదనిపలువురు ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఆదివారం స్థానిక విలేకరులు పరిశీలించి సమస్య తీవ్రతను రాయగడలో గల ఎఇఇ, బొబ్బిలిలో ఉన్న ఐఒడబ్ల్యు అధికారి, స్టేషన్ మాస్టారుల దృష్టికి తీసుకెళ్లగా వారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెెళ్తామని తెలియజేశారు. ఇప్పటికే పలుసార్లు నివేదించినా సమస్య పరిష్కారం జరగలేదని తెలిపారు. దీంతో స్థానికులు పడుతున్న ఇబ్బందులను అరకు పార్లమెంటు సభ్యులు గొడ్డేటి మాధవి దృష్టికి సంతకాలు చేసిన ఒక వినతి పత్రాన్ని పంపించినట్లు తెలిపారు. దీనిపై ఎంపి స్పందిస్తూ రైల్వే స్టేషన్ వద్ద రోడ్డు దుస్థితిని విశాఖ డివిజనల్ రైల్వేమేనేజర్ దృష్టికి తీసుకెనట్టు తెలిపారు. ప్రయాణికులు రోడ్డు వల్ల రాత్రిపూట ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని తక్షణమే పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.










