Aug 06,2023 20:22

కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్‌, డిప్యూటీ మేయర్‌

ప్రజాశక్తి - కర్నూలు జిల్లాపరిషత్‌
'అమృత్‌ భారత్‌ స్టేషన్‌' పథకంలో భాగంగా ఆదివారం కర్నూలు సిటీ రైల్వేస్టేషన్‌ పునరాభివృద్ధికి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసినట్లు కర్నూలు ఎంపీ డాక్టర్‌ సంజీవ్‌ కుమార్‌ తెలిపారు. కర్నూలు రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసారంలో ఎంపీ డాక్టర్‌ సంజీవ్‌ కుమార్‌, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌, జడ్‌పి ఛైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి, నగర మేయర్‌ బివై.రామయ్య, రైల్వే శాఖ సీనియర్‌ డిఎన్‌సి లైన్స్‌ అనిల్‌ కుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద కర్నూలు సిటీ ఎంపిక కావడం సంతోషంగా ఉందని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలను హైదరాబాద్‌తో అనుసంధానం చేస్తున్న ముఖ్యమైన మార్గాల్లో ఉన్న కర్నూలు రైల్వేస్టేషన్‌ అభివృద్ధికి దాదాపు రూ.42.62 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. దేశంలో రైల్వే వ్యవస్థ అతి పెద్ద వ్యవస్థ అని, ఈ వ్యవస్థను రక్షించుకోవడం మన బాధ్యత అని తెలిపారు. రైలులో ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరూ టికెట్‌ కొనాలని, రైల్వే పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కర్నూలు నగరం నుంచి మచిలీపట్నానికి వెళ్లే రైలును పునరుద్ధరించాలని కోరారు. కర్నూలు నుంచి విజయవాడకు రోడ్డు మార్గం సరిగా లేనందున ప్రజలు రైల్వే ప్రయాణంపై ముగ్గు చూపుతారని తెలిపారు. రోజూ కర్నూలు నుంచి విజయవాడకు రైలు నడపాలని, ఈ రైల్వే స్టేషన్‌కు ఫిట్‌ లెన్స్‌ ఏర్పాటు చేయాలని కోరారు. వర్క్‌ షాప్‌ కూడా ఏర్పాటు చేయాలని రైల్వే అధికారులకు తెలిపారు. అనంతరం జడ్‌పి ఛైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడారు. కర్నూలు సిటీ రైల్వే స్టేషన్‌ను దాదాపు రూ.43 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ నిధులను మంజూరు చేయించడంలో ఎంపీ కృషి ఉందన్నారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ మాట్లాడుతూ... ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతమని, పేదలు తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే సౌకర్యం ఒక రైలు ద్వారానే సాధ్యమవుతుందని తెలిపారు. మేయర్‌ బివై.రామయ్య మాట్లాడుతూ... కర్నూలు నగరానికి రైల్వే శాఖ తలమాణికం లాంటిదని, తక్కువ ఖర్చుతో ఎక్కువ మందిని సుదూర ప్రాంతాలకు చేర్చేది ఒక్క రైలు మార్గమేనని తెలిపారు. జిల్లా నుంచి ఇంకా కొత్త రైళ్లను నడపాలని, కర్నూలు నుంచి ఓర్వకల్లు, పాణ్యం మీదుగా నంద్యాలకు ఒక రైలు, కర్నూలు నుంచి శ్రీశైలం, మార్కాపురానికి ఒక రైలు, కర్నూలు నుంచి మంత్రాలయానికి రైలు వేస్తే బాగుంటుందని రైల్వే అధికారులకు సూచించారు. బిజెపి జిల్లా ఇన్‌ఛార్జీ రాఘవేంద్ర, నగర డిప్యూటీ మేయర్‌ సిద్ధారెడ్డి రేణుక, స్టేషన్‌ మేనేజర్‌ సుంకన్న, డిసిఎంఎస్‌ ఛైర్మన్‌ శిరోమణి పాల్గొన్నారు.