Jul 27,2023 22:02

సమావేశంలో మాట్లాడుతున్న కమిషనర్‌

ప్రజాశక్తి-హిందూపురం : పట్టణంలోనే చేపట్టిన రైల్వే రోడ్డు విస్తరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమోద్‌ కుమార్‌ అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు ఆయన గురువారం తన చాంబార్‌ లో పట్టణ ప్రణాళిక విభాగం, ఇంజనీరింగ్‌ అధికారులు, సచివాలయ ప్లానింగ్‌ సెక్రటరీలతో రైల్వే రోడ్డు విస్తరణ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రైల్వే రోడ్డు విస్తరణలో భాగంగా భవనాలు కోల్పోతున్న యజమానులకు వెంటనే నోటీసులను అందించి, నష్టపరిహారం కింద అందించే చెక్కులను ఇవ్వాలని ఆదేశించారు. 30 సంవత్సరాలుగా పుర ప్రజలు ఎదురు ఎదురుచూస్తున్న రైల్వే రోడ్డు విస్తరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు ఇప్పటికే రూ.85.23లక్షలతో రోడ్డుకు ఇరువైపులా మురుగు కాలువ నిర్మాణ పనులు ప్రారంభం కాగా రోడ్డుకు ఇరువైపులా విస్తరణలో తొలగించాల్సిన భవనాలు ఇంకా తొలగించక పోవడంతో పనులు వేగవంతంగా జరగడం లేదన్నారు. అనుకున్న గడువులోగా పనులు పూర్తి కావాలంటే అధికారులు వారికి కేటాయించిన పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. పురపాలక సంఘంలో ఉన్న అంతర్గత రహదారుల్లో అత్యంత రద్దీగా ఉండే అంతర్గత రహదారి రైల్వే ఫీడర్‌ రోడ్డు అని ఈ రోడ్డు విస్తరణ పనులను ఎప్పుడు చేపడతారని హిందూపురం ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. రైల్వే రోడ్డు అభివృద్ధిలో భాగంగా హిందూపురం పట్టణం అహూడా పరిధిలో ఉండడంతో రైల్వే రోడ్డు అభివృద్ధి కోసం రూ. 2 కోట్లు మంజూరు చేయాలని ఇప్పటికే లేఖ రాసినట్లు చెప్పారు. ఆ నిధులు వచ్చిన వెంటనే నూతనంగా రైల్వే రోడ్డు నిర్మాణం చేయడంతో పాటు డివైడర్లు, సెంటర్‌ లైటింగ్‌ ఏర్పాటు చేసి హిందూపురం పురపాలక సంఘంలోనే ఒక మోడల్‌ రోడ్డు గా తీర్చి దిద్దడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో మునిసిపల్‌ ఇంజనీర్లతో పాటు పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, సచివాలయ ప్లానింగ్‌ సెక్రటరీలు పాల్గొన్నారు.