Sep 15,2023 23:07

మాట్లాడుతున్న గురుమూర్తి

ప్రజాశక్తి-గుంటూరు : రైల్వే రంగం పరిరక్షణకు ప్రజలు, ఉద్యోగులు ఐక్యంగా పోరాడాలని ఆలిండియా లోకో రన్నింగ్‌ స్టాఫ్‌ అసోసియేషన్‌ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్‌.గురుమూర్తి పిలుపునిచ్చారు. 1973 చారిత్రాత్మక రైల్వే సమ్మె సర్ణోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహించారు. గురుమూర్తి మాట్లాడుతూ రైల్వే ఒక సామాజిక వ్యవస్థని, ప్రజల ఆకాంక్షలకు, అవసరాలకు అందుబాటులో ఉండే వ్యవస్థని చెప్పారు. 1853 నుండి ప్రజలు ఈ రంగాన్ని ఎంతో ఆదరిస్తున్నారని, కానీ గత ప్రభుత్వం కొంత, ప్రస్తుత ప్రభుత్వం మరింతగా రైల్వేను ప్రైవేటీకరిస్తున్నాయని విమర్శించారు. ప్రైవేటీకరణ వల్ల సామాన్యులకు అందుబాటు ధరల్లో సులభమైన ప్రయాణం సాధ్యం కాదని చెప్పారు. నియామకాలు తగ్గాయని, 18 లక్షలకుగాను ప్రస్తుతం 9.5లక్షల మంది ఉద్యోగులే పనిచేస్తున్నారని తెలిపారు. ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులతో వ్యవస్థను నడిపిస్తోందని, రైల్వే భద్రతను ప్రభుత్వమే నీరుగారుస్తోందని విమర్శించారు. కీలకమైన లోకోపైలెట్‌ పోస్టులనూ కుదిస్తోందని, 90వేల ఖాళీలున్నాయని, లోకోపైలెట్లకు సిసి కెమెరాలు అభద్రతకు గురి చేస్తున్నాయని, 8 గంటల పనివిధానం అమలు కావట్లేదని వివరించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజి మాట్లాడుతూ దేశంలో పేద ప్రజలకు అత్యంత చౌకైన ప్రయాణం అందిస్తున్న రైల్వేలను కేంద్రం ప్రైవేటీకరణకు పూనుకోవటం దారుణమన్నారు. ఉద్దేశపూర్వకంగా లక్షలాది ఖాళీలను భర్తీ చేయట్లేదన్నారు. సుమారు 3.5 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. బ్యాంకులు, బీమా, రైల్వే, ఆఖరికి రక్షణ రంగాన్ని కూడా కేంద్రం ప్రైవేటీకరిస్తోందని, దీనిలో భాగంగానే కొత్త పోస్టులు భర్తీ చేయట్లేదని విమర్శించారు. అన్ని సంఘాలు, ప్రజలు కలిసి రైల్వేను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. సదస్సులో ఎఐఎల్‌ఆర్‌ఎస్‌ఎ సౌత్‌ సెంట్రల్‌ రైల్వే జోన్‌ జనరల్‌ సెక్రెటరీ ఎస్‌.కె.జిలానీ భాషా, డివిజన్‌ ప్రెసిడెంట్‌ మన్‌బహుదూర్‌, జోనల్‌ అసిస్టెంట్‌ జనరల్‌ సెక్రెటరీలు జి.వెంకటేశ్వరరావు, కె.ప్రసాద్‌, నాయకులు కె.రామకృష్ణ, ఎం.సి.శేఖర్‌, ఆర్‌డి నాయక్‌ పాల్గొన్నారు.