ప్రజాశక్తి - విజయవాడ : ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ (ఎఐఎల్‌ఆర్‌ఎస్‌ఎ) విజయవాడ డివిజనల్ కమిటీ ఆధ్వర్యంలో రన్నింగ్ కార్మికుల గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ స్థానిక రైల్వే ఇనిస్టిట్యూట్‌లో ఆదివారం జరిగాయి. ఈ సందర్భంగా ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ డివిజన్ సెక్రటరీ కె.రామకృష్ణ మాట్లాడుతూ... 1973 సమ్మె దిగ్విజయంగా జరిగిన సందర్భంగా ఆనాటి భారత ప్రభుత్వానికి, ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్‌కు మధ్యన 1973 ఆగస్టు 13న ఒక ఒప్పందం జరిగిందని, అప్పటి కేంద్ర రైల్వేమంత్రిగా ఉన్న ఎల్‌ఎన్ మిశ్రా ఆ ఒప్పంద వివరాలను 1973 ఆగస్టు 14న పార్లమెంట్‌లో ప్రకటించారని అన్నారు. అప్పటి నుంచి 1973 సంవత్సర సమ్మె రన్నింగ్ కార్మికులకు చారిత్రాత్మక విజయంగా పేర్కొనడం జరిగిందన్నారు. జరిగిన ఒప్పందం ప్రకారం నిర్దిష్టమైన 10 గంటల పని విధానం నిర్ణయించబడిందన్నారు. కానీ ఈ ఒప్పందానికి ముందు వరకు కూడా అపరిమిత పని గంటలు పని చేయాల్సి వచ్చేదన్నారు. ఈ సమ్మెలో పాల్గొన్న రన్నింగ్ కార్మికులను ఉద్యోగం నుంచి తొలగించబడిన ఉద్యోగులను తిరిగి నియమించే విధంగా ఒప్పందం కుదిరిందన్నారు. ''ఈ 1973 ఎఐఎల్‌ఆర్‌ఎస్‌ఎ సమ్మె రైల్వే చరిత్రలో మొదటిది చివరిదిగా చరిత్ర పుటలలో నిలిచిపోయిందన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆ సమ్మెలో పాల్గొన్న 16 మంది సమ్మె వీరులందరికి విజయవాడ డివిజన్ స్థాయిలో భారీ స్థాయిలో సన్మానాన్ని చేయడం జరిగిందన్నారు. అనంతరం లోకో రన్నింగ్ స్టాఫ్ ప్రస్తుత సమస్యలపై, రైల్వే ప్రైవేటీకరణ, రైల్వే ప్రయాణికుల భద్రతపై వివిధ సంఘాల నాయకులతో, రైల్వే రన్నింగ్ కార్మికులతో సమావేశం జరిగిందన్నారు. డివిజన్ స్థాయిలో 539 లోకో రన్నింగ్ కేటగిరీ ఖాళీలు ,47 రన్నింగ్ సూపర్వైజర్ పోస్టులను తక్షణమే భర్తిచేయాలన్నారు. ప్రయాణికుల భద్రత దష్ట్యా క్రూ లింక్స్ ఖచ్చితంగా పాటించాలని కోరారు స్టాఫ్ కనీస అవసరాలు కోసం 30శాతం లీవ్ రిజర్వ్, 4 వారాంతపు (30గంటలు) సెలవులు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్ర మంలో బ్రాంచ్ ప్రెసిడెంట్ బిసిఎస్‌రావు, నాయ కులు ఎం వెంకటేశన్, ఆర్‌వి రాము పాల్గొన్నారు.










