Jul 28,2023 22:51

ధర్నా చేస్తున్న రైల్వే కాంట్రాక్టు కార్మికులు

ప్రజాశక్తి - ఆమదాలవలస: రైల్వే ప్రైవేటీకరణ ఆపాలని, రైల్వే కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆలిండియా రైల్వే కార్మికుల డిమాండ్స్‌ డే సందర్భంగా శ్రీకాకుళం రోడ్డు రైల్వేస్టేషన్‌ వద్ద రైల్వే కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యాన రైల్వే కార్మికులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని, రైల్వే కాంట్రాక్టు కార్మికులందరినీ క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేశారు. రైల్వేలో శాశ్వత స్వభావం గల పనులన్నింటిలో ఉన్న కాంట్రాక్టు కార్మికులందరికీ రైల్వేలో ఉద్యోగాలు కల్పించాలన్నారు. కాంట్రాక్టర్లు మారినా కార్మికులను పనిలో కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. టెండర్‌ అగ్రిమెంట్స్‌లో కాంట్రాక్టర్స్‌ మారినా కార్మికులను తొలగించరాదనే నిబంధనను పొందుపరచాలన్నారు. కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, 60 ఏళ్ల వరకు వారిని కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. నియామక పత్రాలు, గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. ప్రతినెలా ఐదో తేదీ లోపు జీతాలను రైల్వే యజమాన్యమే చెలించేలా బాధ్యత వహించాలన్నారు. పిఎఫ్‌, ఇఎస్‌ఐ సౌకర్యాలను అమలు చేయాలన్నారు. బోనస్‌, వర్కమెన్‌ కాంపన్సేషన్‌, ప్రసూతి సెలవులు తదితర సాంఘిక భద్రతా సౌకర్యాలు కల్పించాలని కోరారు. దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్‌కోస్ట్‌ రైల్వేలో కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ సర్వీసును 50 ఏళ్ల వరకు పరిమితం చేసి విధించిన వయోనిబంధనల రైల్వే ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ సంవత్సరానికి 9 రోజలు క్యాజువల్‌ లీవ్స్‌, 19 రోజులు ఎర్నడ్‌ లీవ్స్‌ ఇవ్వాలని, వారాంతపు సెలవులు, ప్రభుత్వ సెలవు రోజుల్లో పనిచేసిన కాలానికి రెట్టింపు వేతనాలివ్వాలని డిమాండ్‌ చేశారు. జీతంతో కూడిన వారాంతపు సెలవులు మంజూరు చేయాలన్నారు. ధర్నాలో ఫెడరేషన్‌ నాయకులు వి.ఆదినారాయణ, జనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు బొడ్డేపల్లి జనార్థనరావు, రిటైర్డ్‌ రైల్వే శ్రామిక కాంగ్రెస్‌ పూర్వ కార్యదర్శి బెండి సూర్యనారాయణ, మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ జిల్లా కోశాధికారి టి.సంతోష్‌ కుమార్‌, ఆటో వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు పి.తిరుపతిరావు, పి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.