May 23,2023 23:04

ప్రజాశక్తి-సింగ్‌నగర్‌
వాంబేకాలనీలో అండర్‌ బ్రిడ్జి నిర్మాణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాన్ని, రైల్వే పోలీసుల వేధింపులు, దౌర్జన్యాలను నిరసిస్తూ మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు మాట్లాడుతూ రైల్వే బ్రిడ్జి నిర్మించకపోగా రైలు కట్ట దాటుతున్న స్థానికులు, పేదలపై రైల్వే పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని, అక్రమంగా నిర్బంధించి రైల్వే కోర్టులో పెట్టి 1100 రూపాయలు వరకు ఒక్కొక్కరిపై ఫైను వేస్తున్నారనీ, ఇదేమి దుర్మార్గమని అన్నారు. తమ వద్ద నుండి ఫోన్లు లాక్కుంటున్నారని, ఆరు నెలలు జైలు శిక్ష వేస్తామని బెదిరిస్తున్నారని స్థానికులు చెబుతున్నారన్నారు. రోజుల తరబడి స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిప్పడంతో తాము పనులు కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. వందే భారత్‌ రైలుకు రక్షణ పేరుతో మోహరిస్తున్న రైల్వే పోలీసులు పేదలపై దౌర్జన్యం చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. 20 సంవత్సరాల నుంచి అండర్‌ బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చి మాట తప్పిన పాలకులది నేరం కాదా అని ప్రశ్నించారు. నడిస్తే ఫెనాల్టీలు వేయడం అమానుషమన్నారు. పేదలు ఉపాధి లేక, ఆదాయం చాలక నానా అవస్థలు పడుతుంటే ఉపశమనం కలిగించాల్సిన ప్రభుత్వాలు పేదలను నిర్బంధించి భయభ్రాంతులకు గురిచేయడం గర్హనీయమన్నారు. విజయవాడ నగరాన్ని పాలకులు అన్ని విధాల అధోగతి పాలు చేస్తున్నారన్నారు. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు రాష్ట్ర ప్రణాళికా సంఘానికి ఉపాధ్యక్షుడుగా ఉన్నా నగరానికి, నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని విమర్శించారు. ఒక్క ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి కూడా నియోజకవర్గంలో కొత్తగా నిర్మించలేదని, అర్ధాంతరంగా ఆగిపోయిన వాటిని పూర్తి చేయలేదని అన్నారు. గుణదల, మధురా నగర్‌ బ్రిడ్జిలు మొండిగోడలతో మిగిలిపోయాయన్నారు. ప్రజా ప్రతినిధులు ప్రచార ఆర్భాటం తప్ప అభివృద్ధిపై దష్టి పెట్టలేదన్నారు. ఎన్నికల సంవత్సరంలోనైనా బ్రిడ్జిల నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు. రైల్వే పోలీసుల వేధింపులు ఆపాలని డిమాండ్‌ చేశారు. వాంబేకాలనీ రైల్వే అండర్‌ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి రమణరావు, కే దుర్గారావు, సిహెచ్‌ శ్రీనివాస్‌, పీర్‌ సాహెబ్‌, సాంబిరెడ్డి, కళ్యాణ్‌, ఓంకార్‌, అప్పన్న, రాంబాబు, మహేష్‌ పాల్గొన్నారు.