Jan 30,2023 21:54

రూటు మారిన కొవ్వూరు-భద్రాచలం లైన్‌
సత్తుపల్లి-కొవ్వూరు లైన్‌కు కొత్త ప్రతిపాదన
కొత్త ప్రతిపాదనలకైనా నిధులొచ్చేనా
కదలిక లేని కోటిపల్లి-నరసాపురం రైల్వేలైన్‌ పనులు
ఈ బడ్జెట్‌లోనైనా నిధుల కేటాయింపు జరిగేనా
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దశాబ్దాలుగా కలగా ఉన్న రైల్వేలైన్లకు ఈ ఏడాదైనా కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపు జరిగేనా అనే చర్చ జిల్లావాసుల్లో నడుస్తోంది. ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో 2023-24కు సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. దీంతో జిల్లాకు సంబంధించిన రైల్వేలైన్లకు నిధుల కేటాయింపు చేస్తారా లేక ప్రతియేటా మాదిరిగా ఊసేలేకుండా పోతుందనే చర్చ మళ్లీ మొదలైంది. కొవ్వూరు-భద్రాచలం రైల్వేలైన్‌ నిర్మాణం జిల్లావాసులకు నాలుగున్నర దశాబ్దాల కల. ఖమ్మం, పశ్చిమ ఏజెన్సీలో ప్రయాణ సౌకర్యాన్ని, వివిధ ఉత్పత్తులను తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం తీసుకువెళ్లే రవాణా సౌకర్యాన్ని కల్పించే రైలు మార్గం ఇది. 1965 నుంచి ఈ రైల్వే లైన్‌ నిర్మించాలనే డిమాండ్‌ ఉంది. ఉమ్మడి జిల్లాలో కొవ్వూరు, పంగిడి, దేవరపల్లి, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, అశ్వారావుపేట, రాయవరం మీదుగా 155.6 కిలోమీటర్ల మేర రైల్వేలైన్‌ నిర్మించి మార్గమధ్యంలో 16 స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ లైన్‌ నిర్మాణం జరిగితే కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్‌ నుంచి బొగ్గును నేరుగా రైల్వే ద్వారా విశాఖకు, హైదరాబాద్‌కు పంపడానికి వీలుంటుంది. ఈ రైల్వేలైన్‌కు సంబంధించిన ఖర్చులో 50 శాతం వాటా రాష్ట్ర్రం భరించాల్సి ఉంటుంది. 2014లో రాష్ట్ర విభజన జరగడం, మోడీ సర్కార్‌ అధికారంలోకి రావడంతో ఈ రైల్వేలైన్‌ను పూర్తిగా పక్కన పెట్టేసింది. కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ప్రతిసారీ జిల్లావాసులు ఈ రైల్వేలైన్‌కు నిధులు కేటాయిస్తుందని ఆశపడి భంగపడటం పరిపాటిగా మారింది. అయితే కొవ్వూరు-భద్రాచలం లైన్‌ను పూర్తిగా పక్కన పెట్టేసి దానికి బదులు కొత్త ప్రతిపాదనలను రైల్వేశాఖ తెరపైకి తెచ్చినట్లు తెలిసింది.
కొత్త రైల్వేలైన్‌ ప్రతిపాదనలు ఇలా..
కొవ్వూరు-భద్రాచలం రైల్వే లైన్‌ అలైన్‌మెంట్‌లో మార్పులు చేసి సత్తుపల్లి మీదుగా రైల్వేలైన్‌ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇలా చేస్తే భద్రాచలం నుంచి సత్తుపల్లి వరకూ భూసేకరణకు సంబంధించిన నిధులు తామే సమకూరుస్తామని సింగరేణి కాలరీస్‌ ముందుకొచ్చినట్లు చెబుతున్నారు. ఈ మార్గం నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయంలో దాదాపు రూ.607 కోట్లు భరించేందుకు సింగరేణి కాలరీస్‌ సిద్ధపడినట్లు సమాచారం. దీంతో కొవ్వూరు-భద్రాచలం రైల్వేలైన్‌ను పక్కన పెట్టేసినట్లు చెబుతున్నారు. కొత్తగా ప్రతిపాదించిన రైల్వేమార్గం 118 కిలోమీటర్లుగా తేల్చారు. దీనిలో తెలంగాణలో 48.9 కిలోమీటర్లు, ఎపిలో 70 కిలోమీటర్లు ఉంది. ఈ రైల్వేలైన్‌కు మొత్తం రూ.మూడు వేల కోట్లు ఖర్చు కానున్నట్లు ప్రతిపాదనలు సైతం తయారైనట్లు సమాచారం. ఈ రైల్వేలైన్‌కు కూడా తెలంగాణ, ఎపి కొంత వాటా చెల్లించాలని నిర్ధేశించినట్లు తెలిసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రాలేదని సమాచారం. దీంతో కేంద్రమే పూర్తిస్థాయి ఖర్చును భరించేలా మరో ప్రతిపాదన తయారు చేసినట్లు చెబుతున్నారు. కేంద్రం చేపడుతున్న సాగరమాల ప్రాజెక్టులో ఈ రైల్వేలైన్‌ చేర్చాలని చూస్తున్నట్లు సమాచారం. దీనికి కేంద్రం సిద్ధపడుతుందా లేదా అనేది ఈ బడ్జెట్‌లో తేలనున్నట్లు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం నిర్మితమవుతున్న గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకు సమాంతరంగా ఈ రైల్వేలైన్‌ నిర్మాణం జరిగేవిధంగా ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. ఒకవేళ కొవ్వూరు-సత్తుపల్లి రైల్వేలైన్‌గా మార్పు చేస్తే.. కొత్త ప్రతిపాదనలకైనా బడ్జెట్‌లో నిధుల కేటాయింపు జరిగేనా అనేది వేచిచూడాలి.
కోటిపల్లి - నరసాపురం రైల్వేలైన్‌కు మోక్షం కలిగేనా
ఉమ్మడి జిల్లాలో మరోముఖ్యమైన రైల్వే మార్గం కోటిపల్లి-నరసాపురం. ఈ రైల్వేలైన్‌ను 2000-2001లో ప్రతిపాదించారు. లోక్‌సభ స్పీకర్‌ బాలయోగి హయాంలో ఇది తెరపైకి వచ్చింది. మొత్తం 57 కిలోమీటర్లు పొడవునా ఈ రైల్వే లైన్‌ నిర్మాణం జరగాల్సి ఉంది. మొత్తం రూ.2,120 కోట్లు అంచనాలతో ఈ రైల్వేలైన్‌ ప్రతిపాదనలు సిద్ధమైనప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో అంచనా వ్యయం ఇంకా పెరిగే అవకాశం ఉంది. గోదావరిపై మూడుచోట్ల బ్రిడ్జిలు నిర్మాణం జరగాల్సి ఉంది. ఇప్పటి వరకూ ఈ రైల్వేలైన్‌ ఒక్క అడుగు కూడా ముందుకు పడిన పరిస్థితి లేకుండాపోయింది. నిధుల కేటాయింపునకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెపం మోపుకుంటూ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ రైల్వేలైన్‌కు సంబంధించి 50 శాతం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. ఈ రైల్వేలైన్‌ నిర్మాణం జరిగితే విజయవాడ నుంచి విశాఖ రైల్వేలైన్‌ మాదిరిగా మరో రైల్వేలైన్‌ ఏర్పాటవుతోంది. వ్యవసాయ, ఆక్వా ఉత్పత్తుల రవాణా మరింత తేలికవుతుంది. ఈ బడ్జెట్‌లోనైనా కోటిపల్లి-నరసాపురం రైల్వేలైన్‌కు మోక్షం కలిగేనా అనే చర్చ జిల్లావాసుల్లో నడుస్తోంది.