Oct 22,2023 18:38

ప్రయాణికుల, వాహనదారుల అవస్థలు
అండర్‌ టన్నెల్‌ నిర్మాణమే పరిష్కారం
ప్రజాశక్తి - ఆకివీడు

            మండల కేంద్రమైన ఆకివీడు పట్టణంలో సిద్దాపురం రోడ్డులో రైల్వే గేట్‌ వద్ద అండర్‌ టన్నెల్‌ నిర్మించాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న రైల్వే డబ్లింగ్‌ లైన్‌ విద్యుదీకరణ పనులు పూర్తవ్వడంతో మొదట్లో ఈ ప్రాంత ప్రజలు ఎంతగానో ఆనందపడ్డారు. రైళ్ల సంఖ్య పెరుగుతుందని ఆశించారు. మెయిన్‌ లైన్‌లో ఉన్న రైళ్లు కొన్నయినా ఇటు మళ్లిస్తారని మొదట్లో భావించారు. వారి ఆశ నిరాశగానే మిగిలింది. రైళ్ల సంఖ్య పెరిగింది. కాని ప్రయాణికుల రైలు కాకుండా గూడ్స్‌ రైళ్ల సంఖ్య పెరిగింది. ఒకటి రెండు కాదు మెయిన్‌ రూట్‌లో ప్రయాణించే గూడ్స్‌లో సగం పైగానే ఇటు మళ్లించారు. రోజుకు 30 గూడ్స్‌ల పైన ఇటుగా తిప్పారు. అయితే ప్రయాణికుల రైలు మాత్రం ఒక్కటి కూడా పెరగలేదు సరి కదా తగ్గాయి. కాగా గతం నుంచి ఉన్న ప్రయాణికుల రైళ్లు రాను, పోను 20 పైగానే ఉన్నాయి. మొత్తంమీద రోజుకు 50కి పైగా రైళ్లు తిరుగుతున్నాయి. అసలు సమస్య ఇక్కడే వచ్చి పడింది. మండల కేంద్రం ఆకివీడు నుంచి సిద్దాపురం, కొల్లేరు తీర గ్రామాలకు వెళ్లే రోడ్డు మధ్యలో ఒక గేటు ఉంది. మరో గేటు దుంపగడపకు వెళ్లే మార్గంలో ఉంది. గేట్లకు దక్షిణం వైపున ఆకివీడు పట్టణం ఉన్నప్పటికీ, గేటు దాటి అవతలకు అంటే ఉత్తరం వైపుగా సుమారు నాలుగో వంతు పట్టణం ఉంది. గ్రామం మధ్యగా రైలు పట్టాలు వెళ్లడంతో రెండు గేట్లు ఏర్పడ్డాయి. ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే గూడ్సుల సంఖ్య పెరగడంతో ఈ గేట్లు తరచుగా పడుతూ ఉండడంతో ప్రజల సమస్య మొదలైంది. రోజు మొత్తం మీద పగటి వేళల్లో సగటున 20 నుంచి 30 నిమిషాలకు ఒకసారి గేటు పడుతుండటంతో ప్రజలు విసిగిపోతున్నారు. దుంపగడపలో ప్రభుత్వ జూనియర్‌ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఆ రోడ్డులో ఉన్న గేటు గుండా ప్రతిరోజు వందల సంఖ్యలో విద్యార్థులు కళాశాలకు వెళ్తూ ఉంటారు. దుంపగడప గ్రామస్తులకు వేలాది మందికి, ఆకివీడు ప్రజానీకానికి ఆ రోడ్డు ఒక మార్గం. ఇక రెండో గేటు సిద్దాపురం రోడ్డులో ఉన్న గేటు. సుమారు ఏడు గ్రామాల ప్రజలు, వేలాది మంది రైతులు, కొల్లేటిదిగో ప్రాంత గ్రామస్తులు నిత్యం ప్రయాణిస్తూ ఉంటారు. ఇక మండల కేంద్రానికి, వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు రకరకాల పనులపై వచ్చే వారందరూ ఆ రోడ్డు గుండానే రావాలి. అయితే ఆ మార్గంలో తరచూ గేటు పడటం సమస్యగా మారింది. గేటు వేసి కనీసం 20 నిమిషాల వరకు తీయడం లేదు. మళ్లీ మరో ఐదు నుంచి పది నిమిషాల్లో గేటు పడిపోతుంది. దీంతో ప్రజానీకం విసిగిపోతున్నారు. ప్రత్యామ్నాయం కోసం రకరకాల ప్రయత్నాలు ఆలోచించినా ఒక్క అండర్‌ టన్నెల్‌ తప్ప వేరే మార్గం కనిపించడం లేదు. వెంటనే సిద్దాపురం రోడ్డులో అండర్‌ టన్నెల్‌ నిర్మించాలని స్థానికులు ప్రభుత్వానికి తరచూ విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. మున్సిపాలిటీ సైతం ప్రభుత్వానికి పంపింది అధికారపార్టీ నాయకులకు సైతం విజ్ఞప్తి చేశారు. అయినా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. మరోపక్క గేటు ప్రభావంతో రియల్‌ ఎస్టేట్‌ పూర్తిగా పడిపోయింది. సిద్దాపురం రోడ్డులో గేటు దాటి గేటుకు ఉత్తర దిక్కున ఉన్న స్థలాలు ఇళ్ల స్థలాల రేట్లు భారీగా పడిపోయాయి. దీంతో ఇంచుమించు క్రయవిక్రయాలు ఆగిపోయాయి. ఈ మార్గంలో రైతులు, పలు గ్రామాల ప్రజలు, వ్యాపారులు, విద్యార్థులకు అనుకూలంగా ఉండే విధంగా వెంటనే రైల్వే అండర్‌టన్నెల్‌ నిర్మించాలని కోరుతున్నారు.