Sep 27,2023 21:52

ప్రజాశక్తి-కాకినాడ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళలో జనరల్‌ బోగీలు స్లీపర్‌ క్లాస్‌ బోగీలు పెంచాలని తదితర డిమాండ్లతో సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడ టౌన్‌ రైల్వే స్టేషన్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కన్వీనర్‌ పలివెల వీరబాబు, నాయకులు కె.సత్తిరాజు, చెక్కల రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రపంచంలోనే రికార్డు సృష్టించిన భారతీయ రైల్వే ప్రతిష్టను మోడీ బిజెపి పాలనలో దెబ్బ తీస్తున్నారని విమర్శించారు. బిజెపి 2014లో అధికారం చేపట్టిన తరువాత రైల్వే బడ్జెట్‌ లేకుండా చేశారన్నారు. దేశ ప్రజలు, రైల్వే ఉద్యోగుల త్యాగంతో నిర్మించిన భారతీయ రైల్వేను కార్పొరేట్‌ కంపెనీలకు దారాదత్తం చేసేస్తున్నారని విమర్శించారు. ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో జనరల్‌ బోగీలు, స్లీపర్‌ క్లాస్‌ బోగీలు పెంచాలన్నారు. ప్యాసింజర్‌ రైలు సర్వీసులు పెంచాలని, రైల్వే ఛార్జీలు తగ్గించాలన్నారు. పిల్లలకు హాఫ్‌ టికెట్‌, సీనియర్‌ సిటిజన్స్‌కు రాయితీ సౌకర్యం అమలు చేయాలన్నారు. కాకినాడ పిఠాపురం రైల్వే మెయిన్‌ లైన్‌ కలపాలని, ఇందుకోసం కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్‌ కృషి చేయాలని కోరారు. రైల్వే ప్రైవేటీకరణ ఆపాలని, రైల్వేలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని సిపిఎం డిమాండ్‌ చేస్తోందన్నారు. ధర్నా అనంతరం కాకినాడ టౌన్‌ రైల్వే స్టేషన్‌ అధికారికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మలకా వెంకటరమణ, కె.నాగ జ్యోతి, కె.సత్తిబాబు, వేణు, సూరిబాబు, మేడిశెట్టి వెంకట రమణ, సూర్యారావు, సిహెచ్‌.విజరు కుమార్‌, అనపర్తి ఏడుకొండలు, కుమార్‌, చిట్టిబాబు, సతీష్‌, స్వామి, శేషు పాల్గొన్నారు.