* ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
* రైల్వే అభివృద్ధి పనులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన
ప్రజాశక్తి - పలాస: రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. అమృత్ భారత్ పథకం కింద పలాస రైల్వేస్టేషన్‌లో రూ.23.85 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు వర్చువల్ విధానంలో ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమృత్ భారత్ పథకం కింద ఎంపికైన రైల్వేస్టేషన్లు మల్టీ మోడల్ హబ్‌గా మారుతాయని చెప్పారు. సుమారు గంటపాటు సాగిన ప్రధాని ప్రసంగాన్ని ప్రజాప్రతినిధులు, రైల్వే అధికారులు, ప్రజలు పలాస రైల్వేస్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన టీవీల్లో వీక్షించారు. అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అమృత్ భారత్ కింద ఎంపిక చేసిన 508 రైల్వేస్టేషన్లలో పలాసను ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. వైద్యునిగా ఉన్న సమయంలో 60కి పైగా దేశాల్లో పర్యటించానని, అక్కడున్న విలాసవంతమైన, వేగవంతమైన రైళ్లను చూసి మన దేశంలో ఎప్పుడు వస్తాయని ఎదురుచూడగా, వందేభారత్ రూపంలో సాకారమైందన్నారు. కోరమాండల్, షిరిడీ, రామేశ్వరం ఎక్స్‌ప్రెస్‌లకు పలాస రైల్వేస్టేషన్‌లో హాల్ట్ కల్పించాలని రైల్వే అధికారులను కోరారు. పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాలకు చెందిన ఎక్కువ మంది ప్రజలు ఛత్తీస్‌ఘడ్, బిలారు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారని, పలాస నుంచి బిలారు వరకు రైలు సౌకర్యం కల్పించాలని కోరారు. తాళ్లభద్ర వద్ద ఆర్‌ఒబి ఏర్పాటు చేయాలని అందుకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు. నర్సిపురం కాలిబాట మార్గాన్ని త్వరగా పునరుద్ధరణ చేయాలని విజ్ఞప్తి చేశారు. అంబుసోలి ప్రాంతంలో రైల్వే ఆస్తులను ఆక్రమించారని ఇటీవల నోటీసులు ఇచ్చారని వాటిని రెగ్యులరైజ్ చేస్తే, ఆ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైల్వే శాఖకు ప్రత్యామ్నాయ భూమిని ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి పలు అంశాల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించగా, విజేతలకు ప్రశంసాపత్రాలతో పాటు జ్ఞాపికలను మంత్రి అప్పలరాజు అందజేశారు. కార్యక్రమంలో సిఎంపిఇ ఎన్.కె సమాల్, ఎడిఇన్ ఆర్.ఆర్ దాస్, పలాస-కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు, వైస్ చైర్మన్ మీసాల సురేష్‌బాబు, స్థానిక కౌన్సిలర్ గుజ్జు జోగారావు, జి.ఎల్ రావు, ఎన్.వి.ఎల్.ఎన్ మూర్తి, బిజెపి జిల్లా అధ్యక్షులు బి.ఉమామహేశ్వరరావు, కొర్ల కన్నారావు, ఈస్ట్‌కోస్ట్ రైల్వే శ్రామిక యూనియన్ నాయకులు పాల్గొన్నారు.










