Sep 08,2023 20:37

అండర్‌బ్రిడ్జి వద్ద నీటిలో నిరసన తెలుపుతున్న గిరిజనులు

ప్రజాశక్తి - కొమరాడ :  రైల్వే అంతర్‌ బ్రిడ్జ్‌ వద్ద వరద నీరు నిల్వ లేకుండా చర్యలు చేపట్టాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి డిమాండ్‌ చేశారు. కూనేరు రైల్వే స్టేషన్‌ సమీపంలో గల మూడవ రైల్వే లైన్‌ అంతర్‌ బ్రిడ్జి వద్ద కిందన ఉన్న నీరు వెంటనే తొలగించి అటు వాహనదారులకు, గిరిజన గ్రామాల ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ మేరకు సిపిఎం, గిరిజన సంఘం ఆధ్వర్యంలో వరదనీటి వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం కోనేరు రైల్వే స్టేషన్‌ మాస్టర్‌ అంకిత్‌ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం సాంబమూర్తి మాట్లాడుతూ 15 గిరిజన గ్రామాలకు అతి ముఖ్యమైన ఈ అంతర్‌ బ్రిడ్జి కింద నీటిని వెంటనే తొలగించి గిరిజన ప్రజలకు విద్య, వైద్యం, నిత్యవసర వస్తువులు తమ గ్రామాలకు తీసుకెళ్లేలా రహదారి సౌకర్యం కల్పించాలని కోరారు. అలాగే మండలంలోని ఉలిపిరి పంచాయతీ సరుడుగూడతోపాటు మరో 13 గిరిజన గ్రామాలకు వెళ్లే రైల్వే లైన్‌ కింద ఉన్న అంతర్‌ బ్రిడ్జి వద్ద నీటిని తొలగించి అటు గ్రామాలకు వెళ్లే ప్రజలకు, ఇటు ద్విచక్ర వాహనదారులకు భరోసా కల్పించాలన్నారు. సరుగుడుగూడ గ్రామానికి వెళ్లే రైల్వే లైను బ్రిడ్జి వద్ద ఉన్న నీరు కొమరాడ మండలానికి సంబంధించి గుమడ రైల్వే స్టేషన్‌ సమీపంలో నయా, చిన్న కేర్జల పంచాయతీలకు చెందిన గ్రామాలకు వెళ్లే రైల్వే లైన్‌ అంతర బ్రిడ్జి కింద అతి చిన్న వర్షానికి కూడా నీరు ఎక్కువ నిల్వ ఉండడంతో ఆ బ్రిడ్జి కింద నుండి వాన దారులు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. తక్షణమే అధికారులు స్పందించి అంతర్‌ బ్రిడ్జి వద్ద ఉన్న నీరుని పూర్తి స్థాయిలో తొలగించి ప్రజలకు, వాహనదారులకు రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఉపేంద్ర, రెడ్డి శివున్నాయుడు, పకీరు, లక్ష్మణదొర, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.