
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా/రొంపిచర్ల : క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటుపడి అప్పులపాలైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి చివరకు రైల్వే పట్టాలపై మృతి చెందారు. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. రొంపిచర్ల మండలం అలవాల గ్రామానికి చెందిన బద్దూరి గంగిరెడ్డి (32) మృతదేహం నాదెండ్ల మండలం సాతులూరు రైల్వే స్టేషన్ సమీపంలో పడి ఉండడంతో రైల్వే పోలీసులు గుర్తించి మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా ఆసుపత్రి తరలించారు. బద్దూరి చిన్న లింగారెడ్డి, కోటేశ్వరమ్మ దంపతుల కుమారుడైన గంగిరెడ్డికి ఏడాదిన్నర క్రితం వివాహమైంది. మృతునికి 11 నెల పాప ఉంది. నాదెండ్ల మండలం తూబాడులోని అత్తవారింటికి, తల్లిదండ్రులు వద్దకు వచ్చి వెళుతూ నరసరావుపేటలో గది అద్దెకు తీసుకుని ఉద్యోగం చేస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్‌లు వేస్తున్న నేపథ్యంలోనే రూ.40 లక్షల మేర అప్పుల పాలయ్యాడు. అప్పుల ఒత్తిడి తట్టుకోలేక ఆదివారం రాత్రి సాతులూరు వద్ద ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నరసరావుపేట రైల్వే సూపరింటెండెంట్ కుమారరాజా ఫిర్యాదు మేరకు రైల్వే పోలీఉలు కేసు నమోదు చేశారు. మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబానికి అప్పగించారు. ఇదిలా ఉండగా గంగిరెడ్డికి అప్పులిచ్చిన వారు తరచూ అలవాల గ్రామంలోని మృతుని తల్లిదండ్రుల వద్దకు వచ్చి వెళుతుంటారని, స్వల్ప వాగ్వివాదం చోటుచేసుకునేదని సమాచారం. ఇటీవల తమ కుమారుడు ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండాలని, రాత్రి సమయంలో తలుపులు గడియ పెట్టుకోవాలని చెప్పేవాడని మృతుని తల్లి చెబుతున్నారు. తమ కుమారుణ్ణి హత్య చేసి రైలు పట్టాలపై పడేసి ఉంటారని, దీనిపై విచారణ చేసి దోషులను శిక్షించాలని కోరుతున్నారు.