Jun 08,2023 19:57

కొవ్వొత్తులతో నివాళులర్పిస్తున్న డివైఎఫ్‌ఐ నాయకులు

ప్రజాశక్తి - దేవనకొండ
ఒడిశా బాలసోర్‌ రైలు ప్రమాద మృతులకు మండలంలోని కుంకునూరు గ్రామంలో గురువారం డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. డివైఎఫ్‌ఐ నాయకులు చిన్న అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మండల నాయకులు శ్రీనివాసులు, చిన్న, వీరేంద్ర మాట్లాడారు. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో రైల్వే ప్రయాణికులకు భద్రత కరువైందని తెలిపారు. రైల్వే ప్రయివేటీకరణపై మోజు వల్లే కేంద్ర ప్రభుత్వం రైల్వేలో ఖాళీగా ఉన్న 3.15 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయలేదని చెప్పారు. ఉద్యోగులపై పని భారం పెరగడం, సిగలింగ్‌ వ్యవస్థపై, రైల్వే ట్రాక్‌ల నిర్వహణపై రైల్వే పూర్తి నిర్లక్ష్యం వహించడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరిగి వందలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రైల్వే ఘటనకు బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. బాలసోర్‌ లాకింగ్‌ వ్యవస్థ సరిగా లేదని, మార్చాలని లైన్‌మేన్‌ చెప్పినప్పటికీ రైల్వే శాఖ పట్టించుకోలేదని తెలిపారు. లోకో పైలట్లు 12 గంటలకు మించి పని చేయరాదని రైల్వే నిబంధన ఉన్నప్పటికీ దుర్మార్గంగా 70 శాతం మంది లోకో పైలట్లను 12 గంటలకు మించి పని చేయిస్తున్నారని చెప్పారు. రైల్వే ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలని, వారి కుటుంబాల సభ్యులకు రైల్వేలో ఉద్యోగావకాశం కల్పించాలని కోరారు. రైల్వే ప్రమాదాలకు కారణమయ్యే రైల్వే ప్రయివేటీకరణను ఉపసంహరించుకోవాలని, రైల్వేలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. డివైఎఫ్‌ఐ, ఇతర ప్రజాసంఘాల నాయకులు గురు రాజు, హరికృష్ణ రసూల్‌, మురళీ, ఉరుకుందు రాఘవేంద్ర, సింహాద్రి పాల్గొన్నారు.