
ప్రజాశక్తి-విజయనగరం కోట : రైలు ప్రమాదంలో గాయపడి విజయనగరం సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను టిడిపి అధ్యక్షులు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మంగళవారం పరామర్శించారు. విజయనగరం చేరుకున్న ఆమెకు టిడిపి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం టిడిపి నాయకులు కిమిడి కళా వెంకటరావు, పి.అశోక్‌గజపతిరాజు, వరగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి తదితరులతో కలిసి ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. ప్రతి ఒక్కరి వద్దకూ వెళ్లి మాట్లాడారు. వారి బాధను తెలుసుకొని ఓదార్చారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకున్నారు. బాధితులకు టిడిపి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు కోసం చేసిన ప్రజల పోరాటం గెలిచిందని, ఇది ప్రజల గెలుపు అని అన్నారు. ఆయన కోసం పోరాటం చేసిన ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు ఆస్పత్రిలోకి అధిక సంఖ్యలో వెళ్లేందుకు టిడిపి నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అశోక్‌గజపతిరాజుకు, డిఎస్‌పి గోవిందరావుకు మధ్య వాగ్వివాదం జరిగింది.