Oct 31,2023 20:58

పరిహారం అందజేస్తున్న జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, కలెక్టర్‌ నాగలక్ష్మి

ప్రజాశక్తి-విజయనగరం కోట : కంటకాపల్లి సమీపంలోజరిగిన రైలు ప్రమాదం లో గాయపడిన బాధితులకు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాస రావు, జిల్లా కలెక్టర్‌ నాగ లక్ష్మి మంగళవారం సర్వజన ఆసుపత్రిలో కోటి 2 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ప్రతి బాధితుని వద్దకు వెళ్లి ముఖ్యమంత్రి ప్రకటించిన పరిహారాన్ని అందజేస్తున్నాని చెప్పి, పూర్తిగా కోలుకున్న తర్వాతనే వైద్యుల సలహా మేరకు ఇంటికి వెళ్ళాలని చైర్మన్‌ తెలిపారు. మెరుగైన వైద్యాన్ని ఉచితంగా అందించాలని ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారని, చెక్కులను మీ ఖాతాలకు వేసుకొని పూర్తిగా కోలుకునే వరకు మందులను వాడి ఆరోగ్యంగా ఉండాలని వారితో అన్నారు. అనంతరం మీడియాతో శ్రీనివాస రావుతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి తొలుత క్షత గాత్రులకు రూ.2 లక్షల పరిహారం ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ ప్రత్యక్షంగా బాధితులను, వారి బాధలను చూసిన తరువాత చలించిపోయి గాయాలను బట్టి 3 కేటగరీ లుగా చేసి పరిహారం మొత్తాన్ని పెంచారని చైర్మన్‌ తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబానికి రూ.10 లక్షలు, శాశ్వత అంగ వైకల్యం పొందిన వారికి రూ.10 లక్షలు పరిహారాన్ని ప్రకటించారని, గాయపడ్డ వారిలో నెల రోజుల్లోపు కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన వారికి రూ .2 లక్షలు , నెల రోజులకు పైగా ఆసుపత్రిలో ఉంచి వైద్య చికిత్స అందించాల్సిన అవసరం ఉన్న వారికి రూ.5 లక్షలు పరిహారాన్ని అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. ఈ విధంగా జిల్లాలో 3 వ కేటగరీ కింద 10 లక్షల పరిహారానికి అర్హతగల ముగ్గురిని, 2 వ కేటగరీ కింద 5 లక్షల పరిహారానికి 10 మందిని, 1 వ కేటగరీ కింద రూ.2 లక్షల పరిహారానికి 11 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. మరో 30 లక్షల రూపాయలను వేర్వేరు ఆసుపత్రులలో ఉన్న బాధితులకు అందజేస్తామని తెలిపారు. మృతి చెందిన 13 మందికి వారి ఖాతాలలో నేరుగా కోటి 30 లక్షల రూపాయలు జమ చేసినట్లు తెలిపారు.కార్యక్రమం లో సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అనిలా సునందిని, డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ గౌరీ శంకర్‌, మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పద్మలీల, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్‌ భాస్కర రావు, వైద్యాధికారులు పాల్గొన్నారు.