Nov 05,2022 00:00

మాట్లాడుతున్న మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పిళ్లా రమాకుమారి, చిత్రంలో ఎంపిపి గోవిందరావు తదితరులు

ప్రజాశక్తి - యలమంచిలి
జాతీయ రహదారి నుంచి యలమంచిలి పట్టణంలోకి వచ్చే రైలు ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులను మున్సిపల్‌ ఛైర్‌ పర్సన్‌ పిళ్లా రమాకుమారి శుక్రవారం పున:ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ జాతీయ రహదారి నుంచి పట్టణంలోకి వచ్చే మార్గంలో ఉన్న రైలు గేటు యలమంచిలి మున్సిపాలిటీపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. ఎమ్మెల్యే రమణమూర్తిరాజు కృషితో రూ.8.10కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులను పున:ప్రారంభించినట్లు చెప్పారు. 2009 ఫిబ్రవరి 15న నాటి మంత్రి కొణతాల రామకృష్ణతో రూ.35 కోట్లతో ఈ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. కాంట్రాక్టర్ల మధ్య ఏర్పడ్డ అభిప్రాయభేదాల మూలంగా బ్రిడ్జి పనులు కుంటుబడ్డాయని పేర్కొన్నారు. బ్రిడ్జి పనులు పూర్తికాకపోవడం వల్ల ఎక్స్‌ప్రెస్‌ బస్సులు యలమంచిలి పట్టణంలోకి రావడం లేదని, దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఆరేడు నెలల్లో పనులు పూర్తి చేసి యలంమంచిలి పట్టణానికి రైలుగేటు సమస్య లేకుండా ప్రయాణాలు సాగనున్నాయని పేర్కొన్నారు. ఎంపిపి బోదెపు గోవిందరావు మాట్లాడుతూ తమది చేతల ప్రభుత్వంగా నిరూపించుకోవడానికి ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షలు బొద్దపు ఎర్రయ్య దొర, మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్లు బెజవాడ నాగేశ్వరరావు, ఆరెపు గుప్తా తదితరులు పాల్గొన్నారు.