Sep 02,2023 00:46

మాట్లాడుతున్న జొన్న శివశంకరరావు

ప్రజాశక్తి-తెనాలి : రైతు ప్రయోజనాలను దెబ్బతీసే విధానాలను ఢిల్లీ రైతాంగ ఉద్యమస్ఫూర్తితో తిప్పికొడతామని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జొన్నా శివశంకరరావు అన్నారు. రేపల్లె-తెనాలి రైలు మార్గంలో జంపని- చినరావూరు రైలు గేటు మూసివేతపై అఖిలపక్ష రైతాంగ సదస్సు శుక్రవారం నిర్వహించారు. ముద్దన సాంబశివరావు అధ్యక్షతన జగ్గడిగుంటపాలెం పాత పంచాయతీ కార్యాల యంలో నిర్వహించిన సదస్సులో శివశంకరరావు ముఖ్య అతిథిగా మాట్లాడారు. రైలు గేటు మూసివేత ఎనిమిది గ్రామాల రైతులకు శాపంగా మారిందన్నారు. ఎరువులు, విత్తనాలు, పండించిన పంట తరలింపుకు అదనపు భారం పడుతోందన్నారు. అధికార యంత్రాగం ద్వారా రైల్వే అధికారులకు పలుదఫాలు విన్నవంచినా స్పందన లేదని, గేటు తెరిపించే వరకూ ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసాంబిరెడ్డి మాట్లాడుతూ రైలు గేటు మూసివేత కారణంగా రూ.4 కోట్ల నాబార్డ్‌ నిధులతో నిర్మించిన రోడ్డు సైతం రైతులు ఉపయోగించుకోలేక పోతున్నారన్నారు. గేటు మూసివేతతో ఎడెనిమిది కిలోమీటర్లు అదనంగా తిరిగి పొలాలకు వెళ్లాల్సి వస్తోందని రైతులు బొంతా అంజనేయులు, తాటి భూలక్ష్మి సదస్సులో అవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తాటి వెంకటేశ్వర్లు కన్వీనర్‌గా కుర్రా వెంకటరమణ, కెవి.సత్యనారాయణ, తాటి కృష్ణ తదితర 13 మంది రైతులతో రైల్వే గేటు సాధన కమిటీని ఎన్నుకున్నారు.