ప్రజాశక్తి - తాడేపల్లి రూరల్ : ఒరిస్సా రైలు ప్రమాదంలో మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి కోరారు. మృతులకు వడ్డేశ్వరంలోని జాతీయ రహదారి వద్ద సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో మంగళవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ రైలు దుర్ఘటనకు బాధ్యత వహిస్తూ రైల్వే శాఖ మంత్రి రాజీనామా చేయాలన్నారు. అంతేకాకుండా మృతుల కుటుంబాలకు రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైల్వే శాఖను కూడా ప్రైవేట్ పరం చేసే చర్యలు, ఖాళీలను భర్తీ చేయకపోవడం దుర్ఘటనకు కారణమని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు అన్నారు. సిగల్ వ్యవస్థను కూడా ప్రైవేట్ పరం చేశారని మండిపడ్డారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య, నాయకులు ఎం.సూర్యనారాయణ, వై.కేశవరావు, జె.శివశంకరరావు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.ధనలక్ష్మి, డి.వెంకటరెడ్డి, కె.శివన్నారాయణ, ఎ.రంగారావు, కె.ఈశ్వర్‌రెడ్డి, పి.కృష్ణ, అప్పలరాజు, కె.స్వాతి పాల్గొన్నారు.










