
జిల్లాలో రైలు ప్రమాదంతో ప్రయాణికులు నానా తంటాలు పడ్డారు. ఈ ప్రమాదం వల్ల ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకూ పలు రైళ్లు రద్దయ్యాయి. దీంతో సుమారు 24 గంటల పాటు ప్రయాణికులు నరకయాతన పడ్డారు. సుదీర్ఘ ప్రాంతాలకు బయలుదేరిన ప్రయాణికులు ఈ ప్రమాదం వల్ల మధ్యలోనే నిలిచిపోవాల్సి వచ్చింది. దీంతో చాలా మంది ప్రయాణికులు రైల్వే స్టేషన్‌లోనే ఫ్లాట్ ఫారం పైన పిల్లా పాపలతో పడిగాపులు కాశారు. దగ్గర ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు రైళ్లు రద్దు విషయాన్ని తెలుసుకుని ఆర్‌టిసి బస్సుల ద్వారా తమ గమ్యాలకు చేరుకున్నారు. కాగా రైల్వే స్టేషన్‌లో వేచి ఉన్న ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంలో రైల్వే శాఖ పూర్తిగా విఫలమైంది. కనీసం తాగునీటిని కూడా అందించకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఎట్టకేలకు సోమవారం సాయంత్రం తిరిగి రైళ్లను పునర్ధురించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రజాశక్తి - విజయనగరం కోట
కొత్తవలస మండలంలోని కంటకాపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో భీమాలి దగ్గర జరిగిన ఘోర రైలు ప్రమాదంతో విజయనగరం మీదగా వెళ్లాల్సిన పలు రైళ్లు సోమవారం కూడా రద్దయ్యాయి. దీంతో సుధీర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు రైల్వే స్టేషన్‌లోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఆదివారం రాత్రి 7.10 నిమిషాలకు ప్రమాదం జరిగిన తరువాత కొన్ని రైళ్లను రద్దు చేయగా సోమవారం కూడా మరో 14 రైళ్లను రద్దు చేశారు. 5 రైళ్లను దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో సోమవారం చాలా మంది ప్రయాణికులు రైల్వే స్టేషన్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. కొంత మంది ప్రయాణికులు మాత్రం రైళ్లు రద్దు కావడంతో విజయనగరం నుంచి ఆర్‌టిసి బస్సు ద్వారా తమ గమ్యాలకు బయలుదేరి వెళ్లిపోయారు.
ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు వెళతామో..
రైళ్లు రద్దు కావడంతో చాలా మంది చిన్న పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. గత రెండు రోజులుగా రైల్వే స్టేషన్‌లోనే ఉండిపోవడంతో తాము ప్రయాణించే రైలు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు ఇంటికి చేరుకుంటామోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రయాణికులు కోసం రైల్వేశాఖ ఎటువంటి ఏర్పాట్లు చేయకపోవడంతో స్టేషన్‌లోనే అవస్థలు పడ్డారు. కనీసం తాగునీరు వంటివి కూడా ప్రయాణికులకు ఇవ్వకపోవడంతో చాలా మంది చిన్నపిల్లలతో అవస్థలు పడ్డారు.
రైల్వేస్టేషన్‌లో హెల్ప్ డెస్క్
విజయనగరం రైల్వే స్టేషన్‌లో సిటిఐ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాయగడ, భువనేశ్వర్, యశ్వంత్‌పూర్ ప్రాంతాల నుంచి విజయనగరం వరకూ వచ్చిన రైళ్లను ఈ స్టేషన్‌లో నిలిపివేశారు. కంటాకాపల్లి వద్ద ప్రమాదానికి గురైన మూడు లైన్లు పునరుద్ధరణ జరిగిన తరువాత లైన్ క్లియర్ అయితే ఈ రైళ్లను పంపించనున్నారు. సోమవారం ఉదయం 11.30 గంటలకు విజయనగరం వచ్చిన తిరుపతి బిలాస్పూర్, 12.20 గంటలకు విశాఖ భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్, హౌరా యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ఖ, విశాఖ ఎక్స్‌ప్రెస్‌లను నిలిపివేశారు. కాగా 14 రైళ్లు రద్దు చేయడంతో పాటు మరో ఐదు రైళ్లను దారి మళ్లించారు.
బెంగుళూరు వెళ్లాలి
నేను బెంగుళూరు వెళ్ళడానికి రైల్వే స్టేషన్‌కు వచ్చాను. బెంగుళూరులో ఎంబిఎం చదువుతున్నాను. రైళ్లు సకాలంలో లేకపోవడంతో రాయపూర్, నాగపూర్ మీదగా దారి మళ్లించారు. ఆ మార్గం గుండా జర్నీ చేయాలంటే చాలా సమయం పడుతోంది. క్లాసులు కూడా అయిపోతాయి. మేనేజ్‌మెంట్ కూడా ఇబ్బందులకు గురిచేస్తోంది.
రెష్మ, ప్రయాణికురాలు, విజయనగరం
రారుపూర్ మీదుగా చెన్నై కష్టమే
నేను చెన్నై వెళ్లాలి. విశాఖ నుంచి కాకుండా విజయనగరం నుంచి చెన్నై వెళ్లడానికి వీలుగా ఉంటుందని ఇక్కడకు వచ్చాను. ఈ ప్రమాదం వల్ల ఇప్పుడు రైళ్లు రద్దయ్యాయి. దీంతో చెన్నై ఎలా వెళ్లాలో అర్థం కావడం లేదు. రాయపూర్, నాగపూర్ మీదగా వెళ్ళాలంటే చాలా సమయం పడుతుంది. అక్కడ కుటుంబ సభ్యులు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
కల్పన, ప్రయాణికురాల, విశాఖపట్నం.
రద్దయిన రైళ్ల వివరాలు
రైలు పేరు నెంబరు
1) కోర్బా - విశాఖ ఎక్స్‌ప్రెస్ (18517)
2) పారాదీప్ - విశాఖ ఎక్స్‌ప్రెస్ (22809)
3) రాయగడ - విశాఖ పాసింజర్ (08503)
4) పలాస - విశాఖ పాసింజర్ (08531)
5) విశాఖ - గునుపుర్ పాసింజర్ (08522)
6)గునుపుర్ - విశాఖ పాసింజర్ (08521)
7) విజయనగరం - విశాఖ మెము స్పెషల్ (07469)
8) విజయవాడ - విశాఖ రత్నాచల్ (12718)
9) విశాఖ - విజయవాడ రత్నాచల్ (12717)
10) గుంటూరు - విశాఖ సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (12739)
11) కాకినాడ - విశాఖ మెము ఎక్స్‌ప్రెస్ (17267)
12) విశాఖ - కాకినాడ మెము ఎక్స్‌ప్రెస్ (17268)
13) రాజమండ్రీ - విశాఖ మెము స్పెషల్ (07466)
14) విశాఖ - రాజమండ్రీ మెము స్పెషల్ (07467)
15)కోరాపుట్ - విశాఖ స్పెషల్ (08545)
16) విశాఖ - కోరాపుట్ స్పెషల్ (08546)
17) పలాస - విశాఖ స్పెషల్ (08531)
18) చెన్నై - పూరి ఎక్స్‌ప్రెస్ (22860)
19) రాయగడ - గుంటూరు ఎక్స్‌ప్రెస్ (17244)