Nov 07,2023 21:01

ఫొటో : విగ్రహావిష్కరణ చేస్తున్న రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి

'రాయసం' ఆదర్శప్రాయుడు
ప్రజాశక్తి ఇందుకూరుపేట : రాయసం వెంకటేశ్వరరావు అందరికీ ఆదర్శప్రాయుడని వైసిపి అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని గంగపట్నం గ్రామంలో మాజీ సర్పంచ్‌ రాయసం వెంకటేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణకు స్థానిక ఎంఎల్‌ఎ ప్రసన్నకుమార్‌ రెడ్డితో కలిసి రాయసం వెంకటేశ్వరరావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ అజాత శత్రువు, ప్రజా నాయకులు రాయసం వెంకటేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణకు హాజరవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
సొంత గ్రామానికి సేవ చేసే అవకాశం చాలా తక్కువ మందికే దక్కుతుందని, ఒకవేళ అవకాశం వచ్చినా సరైన మార్గంలో ఉపయోగించేవారు అరుదన్నారు. అలాంటి అరుదైన వ్యక్తి రాయసం వెంకటేశ్వరరావు అని కొనియాడారు. రాయసం గంగపట్నానికి 2సార్లు సర్పంచిగా, 3 సార్లు వైస్‌ సర్పంచిగా, వార్డు మెంబర్‌గా ఆయన చేసిన సేవలు అమోఘమని గుర్తు చేశారు. గ్రామంలో వెంకటేశ్వరరావు చేసిన అభివృద్ధి ఇప్పటికీ మనకు కనిపిస్తుందని తెలిపారు. పల్లిపాలెం తీర ప్రాంతంలో 2004 తుపాను సమయంలో ఆయన సేవలు ఎప్పటికీ మర్చిపోలేమని, గ్రామస్తులను కంటికి రెప్పలా కాపాడుకున్నారని గుర్తు చేశారు. తండ్రి బాటలోనే ఆయన కుమారులు వాసుదేవ రావు, దామోదర రావు, హృషీకేశవ రావు ప్రజలకు మంచి సేవలు అందిస్తున్నారని, భవిష్యత్తులోనూ కొనసాగించాలని ఆకాంక్షించారు. వెంకటేశ్వర రావు అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌ఎ సివి శేషారెడ్డి, విజయ డెయిరీ చైర్మన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డి, బిజెపి నేత దువ్వూరు రాధాకృష్ణ రెడ్డి, రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్‌ గొల్లపల్లి విజరుకుమార్‌, వైసిపి మండల అధ్యక్షులు మావులూరు శ్రీనివాసులు రెడ్డి, యువనేత దువ్వూరు కళ్యాణ్‌ రెడ్డి, గుణపాటి సురేష్‌ రెడ్డి, బట్టేపాటి నరేందర్‌ రెడ్డి, వైసిపి జిల్లా కోశాధికారి కాటంరెడ్డి రవీంద్రరెడ్డి, వైసిపి యువ నాయకులు కేతంరెడ్డి వినోద్‌కుమార్‌రెడ్డి, ఇతర ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.