Mar 14,2023 00:46
రాయప్రోలు విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-బాపట్ల: ఏ దేశమేగినా ఎందుకాలిడినా.. ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము.. అంటూ నినదించిన మహాకవి రాయప్రోలు సుబ్బారావు చిరస్మరణీయులని బాపట్ల మున్సిపల్‌ హైస్కూల్‌ హెచ్‌ఎం బి రాజశ్రీ అన్నారు. సోమవారం రాయప్రోలు సుబ్బారావు 131వ జయంతి సందర్భంగా ఫోరం ఫర్‌ బెటర్‌ బాపట్ల ఆధ్వర్యంలో మునిసిపల్‌ హైస్కూల్‌ ఆవరణలో రాయప్రోలు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజశ్రీ మాట్లాడుతూ ఆంధ్రజాతిని జాగృతం చేసిన వారిలో రాయప్రోలు అగ్రగణ్యులన్నారు. రాయప్రోలు బాపట్ల ప్రాంత వాసి కావడం, బాపట్ల బోర్డు స్కూల్లో విద్యాభ్యాసం చేయడం భావపురి వాసులకు గర్వకారణ మన్నారు. కార్యక్రమంలో ఫోరమ్‌ కార్యదర్శి పీసీ సాయిబాబు, ఉపాధ్యాయులు కె శ్రీనివాసరావు, ఎండి సాదిక్‌, ఆదినారాయణ రావు, మూర్తి, జాన్‌ సయీద్‌, విద్యార్థులు పాల్గొన్నారు.