Feb 17,2021 06:41

ఇటీవల కేంద్ర ఆర్థికమంత్రి ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ ద్వారా బిజెపి రాయలసీమను అన్ని విధాలా మోసం చేసింది. కడప ఉక్కు పరిశ్రమ, అనంతపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయ నిర్మాణం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు, కర్నూలులో రైల్వే కోచ్‌ రిహాబిలిటేషన్‌ వర్కుషాపు, తిరుపతి రైల్వే డివిజన్‌ హామీ...ఇలా ఏ ఒక్కటీ అమలుచేసే చిత్తశుద్ధి లేదన్నది ఈ బడ్జెట్‌ రుజువు చేసింది. గత ఎన్నికలలో లబ్ధి పొందేందుకు హడావుడిగా 2018 ఫిబ్రవరి 23న కర్నూలులో బిజెపి 'రాయలసీమ డిక్లరేషన్‌'ను ప్రకటిం చింది. రాయలసీమ అత్యంత వెనుకబడిందని దీని అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్‌ లో రూ.20 వేల కోట్లు కేటాయించాలని, రాయల సీమ అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం రూ. పది వేల కోట్లు ఇవ్వాలని, ఈ ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేయాలని, రాయల సీమ జిల్లాలో రాష్ట్ర రెండవ రాజధాని నిర్మించాలని ఇలా అనేకం ప్రకటించారు. నేటి కేటాయింపులు, నాటి కోతలు బిజెపి ద్వంద్వనీతికి ప్రతీకలు.


రాయలసీమ నిత్యం కరువుకు గురవుతూనే వుంది. కరువును రూపుమాపడంలోను, అభివృద్ధి చేయడంలోను మొదటి నుండి పాలకులు ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తూనే వున్నారు. స్వాతంత్య్రానికి ముందు శ్రీబాగ్‌ ఒడంబడిక మొదలు, 2014 రాష్ట్ర విభజన చట్టం వరకు అనేక హామీలు ఇస్తునే వున్నారు. వీటిని అమలు చేయడంలో పాలకుల ద్రోహం కారణంగానే నేటికి రాయలసీమ వెనుకబడిన ప్రాంతంగానే వుంది. రాష్ట్ర విస్తీర్ణంలో 40 శాతం, జనాభాలో 30 శాతం కలిగివున్న రాయలసీమ మొత్తం సాగుభూమిలో నీటి పారుదల కేవలం 7.6 శాతం మాత్రమే వుంది. 2019 అధికార లెక్కల ప్రకారం చిత్తూరు జిల్లాలో 2,500 గ్రామాలకు, అనంతపురం జిల్లాలో 640 గ్రామాలకు, కడప, కర్నూలు జిల్లాలో వంద గ్రామాలకు పైగా ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందితే తప్ప జీవించలేని పరిస్థితి ఏర్పడింది. వలసలే జీవనాధారంగా జీవించే పరిస్థితి వుండడం నాగరిక సమాజానికే అవమానకరం. ఇలాంటి పరిస్థితే ఉత్తరాంధ్రలో కూడా వుంది. ఏ మాత్రం విజ్ఞత వున్న ప్రభుత్వమైన ఈ ప్రాంత అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. నిధులు కేటాయించాలి. కేటాయించిన వాటిని ఖర్చు చేయాలి.


కాని కేంద్రంలో వున్న బిజెపి ప్రభుత్వానికి ప్రజల సమస్యల పరిష్కారం కంటే తనే ప్రజలకు ఓ సమస్యగా మారడమనే వింత లక్షణం వుంది. రాష్ట్ర విభజన చట్టంలో రాయలసీమ అభివృద్ధికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలతో పాటు, తదనంతరం ప్రభుత్వాలు ప్రకటించిన పథకాలు వున్నాయి. కడపలో ఉక్కు పరిశ్రమ, అనంతపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం, 'భెల్‌' ఏర్పాటు, చిత్తూరులో మన్నవరం ప్రాజెక్టు, కర్నూలులో రైల్వే కోచ్‌్‌ వర్కుషాపు, తిరుపతి రైల్వే డివిజన్‌ ఇలా అనేక అంశాలు వున్నాయి. బుందేల్‌ఖండ్‌ తరహాలో రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజి కేటాయిస్తామన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమకు రెండు సార్లు శంకుస్థాపన చేశారేగాని ఈ బడ్జెట్‌లో కనీసం దాని ప్రస్తావనే లేదు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అందులో ఒక్క మాట కూడా కడప ఉక్కు పరిశ్రమ గురించి లేదు. అనంతపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయానికి 2018లో శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణానికి అంచనా రూ.1150 కోట్లు. గత సంవత్సరం బడ్జెట్‌లో రూ. 60 కోట్లు కేటాయించి రూ.4 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ సంవత్సరం మరల రూ.60 కోట్లే కేటాయించారు. యుపిఎ-2 చివరి రోజుల్లో నాటి రైల్వే సహాయమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కర్నూలు రైల్వే వర్కు షాపు కోసం రూ.1100 కోట్లు కేటాయించారు. ఇప్పటి వరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు. అదే కర్నూలు నుండి రాయలసీమ డిక్లరేషన్‌ ప్రకటించిన బిజెపి ఈ బడ్జెట్‌లో ఈ వర్కుషాపు గురించి మాట్లాడకపోవడం విడ్డూరం. అలాగే చిత్తూరు జిల్లాలో మన్నవరం ప్రాజెక్టు, రైల్వే డివిజన్ల గురించి ఈ బడ్జెట్‌ ప్రతిపాదనలకు నోచుకోలేదు.


వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంవత్సరానికి రూ. 50 కోట్ల చొప్పున ఇవ్వడమే పెద్ద విశేషమన్నట్లు చెప్పుకున్న నాటి బిజెపి మూడు సంవత్సరాలు మాత్రమే ఈ నిధులు ఇచ్చి ఆ తరువాత నిలిపివేసింది. ఎయిమ్స్‌ తరహా ఆసుపత్రుల ప్రస్తావన లేదు. నీటి పారుదల, ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రభుత్వ రంగంలో విద్య, వైద్యశాలల ఏర్పాటు చేయడం ద్వారానే రాయలసీమ అభివృద్ధి సాధ్యం. నయవంచనే రాజనీతిగా అమలు చేస్తున్న బిజెపి రాయలసీమ అభివృద్ధికి నిధులు కేటాయిస్తుందని ఆశించలేము. కాని ప్రజల చైతన్యం ముందు ఎంతటి బలమైన పాలకులైనా తల దించక తప్పదు. ఆ దిశగా పోరాటాలు ముమ్మరం చేయడమే రాయలసీమ అభివృద్ధి కోరుకునే శక్తుల తక్షణ కర్తవ్యం.
                                      * వి. రాంభూపాల్‌ (వ్యాసకర్త సిపిఎం అనంతపురం జిల్లా కార్యదర్శి)