రాయలసీమ వ్యతిరేకి సిఎం జగన్
- వైసిపి పాలనలో సీమకు నవ మోసాలు
- కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి
ప్రజాశక్తి - బనగానపల్లె
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రాయలసీమ వాసిగా ఉంటూ సీమకు తీరని ద్రోహం అన్యాయం చేస్తున్నారని మాజీ రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి, నంద్యాల పార్లమెంటు జిల్లా కమిటీ అధ్యక్షుడు జె.లక్ష్మీ నరసింహ యాదవ్‌లు విమర్శించారు. సోమవారం బనగానపల్లె పట్టణంలోని బివి సుబ్బారెడ్డి ఫంక్షన్ హాల్‌లో మీడియా సమావేశం జిల్లా కార్యదర్శి బాలు యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసిపి పాలనలో సీమకు నవమోసాలు జరిగాయని అన్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 46 (3) క్రింద రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో పోరాడి రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేర?ండ్ తరహా అభివద్ధి ప్యాకేజీ నిధులు తెప్పించి అభివద్ధి చేయాల్సింది పోయి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేసులకు భయపడి కేంద్రానికి లొంగిపోయారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం షెడ్యూల్ 13 ప్రకారం కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఆధ్వర్యంలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాల్సి ఉన్నా చేయలేదన్నారు. రాష్ట్ర సచివాలయాన్ని (రాజధానిని) అమరావతి నుండి విశాఖకు తరలిస్తే ఎక్కువ నష్టపోయేది సీమ వాసులేనని తెలిపారు. ఈ ప్రాంతానికి చెందిన ఒక సామాన్యుడు రాష్ట్ర సచివాలయం ఉన్న అమరావతికి పోవాలంటే 6 నుంచి 8 గంటలు, విశాఖపట్నంకు పోవాలంటే 16 గంటలు పడుతుందని అన్నారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాష్ట్ర హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జగన్ పాలనలో మాటలు తప్ప సీమలో హైకోర్టు లేదని, హైకోర్టు బెంచి కూడా ఏర్పాటు చేయలేకపోయారని విమర్శించారు. కడప-మదనపల్లి-బెంగళూరు నూతన రైల్వే బ్రాడ్ గేజ్ మార్గం రాయలసీమ సర్వతోముఖాభివృద్ధికి ఎంతో దోహద పడుతుందని, రాష్ట్ర ప్రభుత్వ వాటాగా నిధులు ఇవ్వని కారణంగా పనులు నిలిచిపోయాయని చెప్పారు. కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని రాయలసీమలో కాకుండా విశాఖలో ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వం బోర్డుకు లేఖ రాయడం శోచనీయమన్నారు. రాయలసీమ ప్రాంతంలోనితెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీ- నీవా తదితర ప్రాజెక్టులు నిధులు లేని కారణంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయని విమర్శించారు. ఎగువ రాష్ట్రమైన తెలంగాణ నీటి కేటాయింపులు, అనుమతులు లేకుండా పాలమూరు-రంగారెడ్డి, దిండి తదితర సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తోందని, అవి పూర్తి అయితే సాధారణ పరిస్థితిలో శ్రీశైలం రిజర్వాయర్‌కు చుక్క నీరు రాదని తెలిపారు. శ్రీశైలం ఆధారంగా నిర్మించిన తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీ-నీవా, వెలిగొండ ప్రాజెక్టులు నిరుపయోగమవుతాయని అన్నారు. ఈ విషయంలో జగన్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయమన్నారు. వ్యవసాయ మోటర్లు రాయలసీమలోనే ఎక్కువగా ఉన్నాయని మీటర్లు బిగిస్తే ఎక్కువ నష్టపోయేది సీమవాసులేనని చెప్పారు. రాబోవు 2024 సార్వత్రిక ఎన్నికల్లో సీమకు ద్రోహం చేస్తున్న వైసిపి, ఇతర పార్టీలను ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో నియోజకవర్గ కో ఆప్షన్ సభ్యులు ముజ్పూర్ రెహమాన్, అల్లా ప్రకాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి గార్లపాటి మద్దిలేటి స్వామి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు పఠాన్ హబీబ్ ఖాన్, జిల్లా యస్సి అధ్యక్షులు నాగలింగం, నాగరాజు, మల్లికార్జున, మధు, బషీర్, శివ రాముడు తదితరులు పాల్గొన్నారు.










