ఈ రాయలసీమ రోటిపచ్చళ్లను మీరెప్పుడైనా తిన్నారా? వామ్మో! అది ఎలా చేస్తారు? ఒకవేళ చేసినా అవి ఎలా ఉంటాయో! అనే అనుమానాలు వ్యక్తం చేస్తారు కొందరు. అలాంటి వారికోసం రాయలసీమలో చేసుకొనే కొన్ని వెరైటీ పచ్చళ్లను పరిచయం చేస్తున్నాం. వాటిని సులభంగా తయారుచేయడం ఎలానో తెలుసుకుందాం. ఇంకెందుకాలస్యం మీరూ తయారుచేసి, తిని చూడండి. వారెవ్వా! అద్భుతంగా ఉన్నాయి అనక మానరు..
పచ్చి మిరపకాయలతో..
కావాల్సిన పదార్థాలు :
పచ్చిమిరపకాయలు- 12, కరివేపాకు- గుప్పెడు, వెల్లుల్లి రెబ్బలు- 7, చింతపండు- నిమ్మకాయ సైజు (నీళ్లలో నానబెట్టుకోవాలి), జీలకర్ర- స్పూను, రాళ్ల ఉప్పు- రుచికి సరిపడా, ఉల్లిపాయ- పెద్దది (ముక్కలు కట్‌చేసుకోవాలి)
తయారుచేసే విధానం :
ముందుగా మిక్సీ జారులో పచ్చిమిరపకాయలు, కరివేపాకును వేసుకోవాలి. అందులోనే నానబెట్టుకున్న చింతపండును వేయాలి. కానీ అందులోని నీళ్లు పోయకూడదు. జీలకర్ర, రాళ్ల ఉప్పును వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.
తర్వాత చింతపండు నానబెట్టుకున్న నీళ్లను కొద్దిగా వేసుకోవాలి.
అందులోనే కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలను, ఉల్లిపాయ ముక్కలను వేసి ఒక్కసారి లైట్‌గా మిక్సీ పట్టాలి. పచ్చడి మెత్తగా పేస్టులా చేసుకోకూడదు. రోట్లో నూరుకుంటే ఇంకా బాగుంటుంది.
ఇది ఇడ్లీ, దోశ, పెరుగన్నం, రాగి సంగటిలోకి ఇది చాలా బాగుంటుంది. ముఖ్యంగా జ్వరంతో నోరు అరుచిగా ఉన్నప్పుడు ఈ పచ్చడి నోటికి భలే రుచిగా ఉంటుంది.
పచ్చికొబ్బరితో..
కావాల్సిన పదార్థాలు : పచ్చి కొబ్బరిముక్కలు- కప్పు, ఎండు మిరపకాయలు- 6, పచ్చి మిరపకాయలు- 5, రాళ్ల ఉప్పు- రుచికి సరిపడా, చింతపండు- కొంచెం, కరివేపాకు- కొంచెం, ఉల్లిపాయ- ఒకటి (మీడియం సైజు), వెల్లుల్లిపాయ- ఒకటి (చిన్నసైజు), జీలకర్ర- పావు స్పూను, ధనియాలు- అరస్పూను, నూనె- స్పూను.
తయారుచేసే విధానం :
ముందుగా పాన్ పెట్టుకుని నూనె వేసి, అది వేడెక్కాక పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా వేగనివ్వాలి.
అందులోనే ఎండు మిరపకాయలను వేసి వేగనివ్వాలి.
తర్వాత ధనియాలు, జీలకర్ర, కరివేపాకు వేసి తక్కువమంటలో వేగనివ్వాలి. చివరిలో పచ్చికొబ్బరి ముక్కలు, చింతపండు వేయాలి. ఇవి ఎక్కువ వేగకూడదు.
అన్నింటినీ తక్కువ మంటమీదనే వేయించి, పక్కన పెట్టుకోవాలి. అవి చల్లారిన తర్వాత మిక్సీ జారులో అన్నింటితోపాటు ఉప్పును వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.
తర్వాత అందులో కొంచెం నీళ్లు పోసి, రుబ్బుకోవాలి. పొట్టు తీయకుండా కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లిపాయను వేసి, ఒక్కసారి మిక్సీలో తిప్పాలి.
అందులోనే సన్నగా, పొడవుగా తరిగిన ఉల్లిపాయలను వేసి, మరోసారి మిక్సీ తిప్పాలి. అంతే పచ్చి కొబ్బరి పచ్చడి రెడీ. దీనిని అన్నం, చపాతీ, అన్ని రకాల టిఫిన్లలో, రాగి సంగటిలోకి మంచి కాంబినేషన్.
గోంగూర పచ్చడి
కావాల్సిన పదార్థాలు : గోంగూర- కట్ట (పెద్దసైజు), పచ్చి మిరపకాయలు- 15, జీలకర్ర- అరస్పూను, కరివేపాకు- కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు- పది, ఉల్లిపాయలు- 2 (ముక్కలుగా తరుక్కోవాలి), నూనె- స్పూను, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు- కొన్ని.
తయారుచేసే విధానం : ముందుగా పాన్‌లో గోంగూర, పచ్చిమిర్చి, కొద్దిగా నీళ్లను వేసి, మూతపెట్టి ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి గోంగూరను పైకి, పచ్చిమిర్చి ముక్కలను కిందికి వెళ్లేలా తిప్పి పెట్టాలి.
గోంగూర ఉడికిన తర్వాత స్టౌ ఆపి చల్లారనివ్వాలి.
తర్వాత మిక్సీజారులో పచ్చిమిరపకాయలను మాత్రమే వేసుకోవాలి. అందులోనే రాళ్ల ఉప్పు వేసి ఒక్కసారి తిప్పాలి. ఇంకా జీలకర్ర, కచ్చాపచ్చాగా దంచిన కొన్ని వెల్లుల్లి రెబ్బలను వేసి, మరోసారి తిప్పాలి.
ఇప్పుడు గోంగూర, ఉల్లిపాయ ముక్కలను వేసి ఇంకోసారి తిప్పాలి.
పోపు లేకుండానూ తినొచ్చు. పోపు కావాలంటే, ఎండుమిర్చి వేసి పెట్టుకుంటే బాగుంటుంది.
టమాటాలతో..
కావాల్సిన పదార్థాలు : టమాటాలు- అరకేజీ (కొన్ని మాగినవి, కొన్ని దోరవి), పచ్చి మిరపకాయలు- 15 లేదా 20, ఉల్లిపాయలు- 2 (మీడియం సైజు), వెల్లుల్లి రెబ్బలు- 10 (పొట్టుతీయనివి), కొత్తిమీర- కొద్దిగా, జీలకర్ర- స్పూను, రాళ్ల ఉప్పు- రుచికి సరిపడా, చింత పండు- కొద్దిగా, పసుపు- పావు స్పూను.
తయారుచేసే విధానం :
ముందుగా పాన్‌పెట్టుకొని, అందులో పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలను వేసుకోవాలి. స్టౌ తక్కువ మంటలో ఉంచాలి. అవి ఉడికేటప్పుడు చింతపండు వేసుకోవాలి.
అందులోనే పసుపు వేయాలి. టమా టాలు మరీ మెత్తగా ఉడకనవసరం లేదు.
అవి ఉడుకుతున్న సమయంలోనే ఉప్పు, ఉల్లిపాయలు వేసి కొంచెం వేడెక్కని వ్వాలి. తర్వాత స్టౌ ఆపి, చల్లారనివ్వాలి.
పచ్చిమిరపకాయలు, చింతపండు, కొద్దిగా కొత్తిమీరను మిక్సీజారులో వేసి ఒక్కసారి తిప్పాలి. తర్వాత వెల్లుల్లిని వేసి మరోసారి తిప్పాలి. ఇప్పుడు జీలకర్ర వేసి ఇంకోసారి తిప్పాలి.
టమాటాలను తీసుకుని, మిక్సీజారులో మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసి తిప్పితే చాలు.