Jul 29,2023 12:48

సమావేశంలో మాట్లాడుతున్న బత్యాల చెంగల్రాయుడు

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ : రాయలసీమ వాసిగా ఉండి ఈ ప్రాంతాన్ని ఎండగట్టిన ద్రోహి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి అని, ఆయన పోతేనే సీమలో సిరులు పండుతాయని టిడిపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు అన్నారు. శనివారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాయలసీమ నీటి ఎద్దడిని తీర్చడానికి గతంలో ఎన్‌టి.రామారావు తెలుగు-గంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా వంటి ప్రాజెక్టులను తీసుకొచ్చి రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు కషి చేశారని తెలిపారు. వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి కూడా రాయలసీమలో నీటి ప్రాజెక్టులకు తన వంతు కషి చేశారని తెలిపారు. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఒకే ఒక్క జీవోతో సీమలో 102 ప్రాజెక్టుల పనులను రద్దు చేశాడని, సీమ ప్రాజెక్టులపై టిడిపి ఐదేళ్లలో రూ.12,411 కోట్లు ఖర్చు చేస్తే వైసిపి నాలుగేళ్ల పాలనలో రూ.2011 కోట్లు మాత్రమే ఖర్చు చేసి చేయి దులుపుకున్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం ఇసుకతో పాటు కాలువలోని మట్టిని కూడా అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. పాలకుల ఇసుక దోపిడీ కారణంగా 2021 నవంబర్‌ 19న అన్నమయ్య ప్రాజెక్టు సమూలంగా కొట్టుకుపోయి 60 మంది జల సమాధి ఐతే రాష్ట్ర ప్రభుత్వం నేటికీ వరద బాధితులకు పునరావాసం కల్పించకపోగా ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకు ఒక్క ఇటుక పేర్చిన పాపాన పోలేదని పేర్కొన్నారు. రాయలసీమలోని 102 ప్రాజెక్టుల పనులు ఆపి కాంట్రాక్టు సంస్థలకు బ్యాంకు గ్యారంటీలు వెనక్కు ఇచ్చారని, సీమ ప్రాజెక్టులు ఆపిన వాడు రాయలసీమ ద్రోహి కాక రక్షకుడు అవుతాడని ప్రశ్నించారు. జగన్‌ రాయలసీమ ద్రోహి అనడానికి ఈ నాలుగేళ్లలో ప్రాజెక్టులలో జరిగిన పనులే నిదర్శనమని తెలిపారు. సీమలో ప్రాజెక్టుల పరిస్థితిని పరిశీలించి ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆగష్టు 1న సీమ పర్యటనకు విచ్చేస్తున్నారని, ఈ కార్యక్రమాన్ని టిడిపి కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి కన్వీనర్లు, పదాధికారులు, కార్యకర్తలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.