Jul 31,2023 22:43

ధర్నాలో మాట్లాడుతున్న జి.ఓబులు

         పుట్టపర్తి అర్బన్‌ : విభజన హామీల్లో భాగంగా వెనుకబడిన రాయలసీమలో కడప ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాల్సి ఉండగా, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మాట తప్పి సీమకు తీరని ద్రోహం చేస్తోందని సిపిఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం ఉదయం శ్రీ సత్యసాయి కలెక్టరేట్‌ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పుట్టపర్తి బస్‌స్టేషన్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. కడప ఉక్కు రాయలసీమ హక్కు అని, సీమకు ద్రోహం చేసిన బిజెపి, కేంద్ర ప్రభుత్వం నశించాలి అంటూ ర్యాలీలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పెద్దన్న అధ్యక్షతన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు ఉపాధ్యక్షుడు ఓబులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజనకు ముందు తాము అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేస్తామని బిజెపి నాయకులు ఇచ్చిన వాగ్దానాలను అడుగడుగునా తుంగలో తొక్కారన్నారు. సీమ ప్రజలను నమ్మించి మోసం చేయడానికి వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డిలు కడప ఉక్కు పరిశ్రమకు మూడుసార్లు శంకుస్థాపన చేశారన్నారు. ఇప్పుడేమో కేంద్రం కడప ఉక్కు పరిశ్రమ లాభదాయకం కాదని తేల్చిందన్నారు. 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచుతామని ప్రగల్బాలు పలికిన జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు కేంద్రం పెద్దలకు సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబు నాడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌లు సైతం కేంద్రానికి భజన చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని ఈ మూడు పార్టీలు ఈ విధానాలు మాని సీమప్రజల కోసం కేంద్రాన్ని ప్రశ్నించాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్‌ మాట్లాడుతూ రాయలసీమకు మొదటి నుంచి పాలకులు మోసం చేస్తూనే ఉన్నారన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కేంద్రీయ విశ్వవిద్యాలయం, బెల్‌, నాసిన్‌ పరిశ్రమలు, టెక్స్‌టైల్‌ పార్క్‌ కర్నూలులో 400 కోట్లతో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, రైల్వే కోచ్‌ నిర్మాణం, కడపలో ఉక్కు పరిశ్రమ ఇలా విభజన హామీలు అన్నింటినీ అమలు చేస్తామని బిజెపి పెద్దలు ప్రగల్బాలు పలికారన్నారు. ఇప్పుడేమో వీటిలో ఏ ఒక్కటీ అమలు చేయకుండా మొండి చేయి చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అన్యాయాన్ని టిడిపి, వైసిపి, జనసేన పార్టీలు ప్రశ్నించలేని స్థితిలో ఉండడం విచాకరం అన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ సాధించేవరకు సిపిఎం పోరాటాలు చేస్తుందని స్పష్టం చేశారు. శ్రామిక మహిళ సంఘం జిల్లా కన్వీనర్‌ దిల్షాద్‌ మాట్లాడుతూ బిజెపికి సాగిలా పడుతూ రాష్ట్రంలోని టిడిపి, వైసిపి, జనసేన పార్టీలు సీమకు తీరని ద్రోహం చేస్తున్నాయని చెప్పారు. విభజన చట్టం మేరకు హామీలను అమలు చేసేలా కేంద్రంలోని బిజెపిపై రాష్ట్ర పార్టీలు ఒత్తిడి పెంచాలన్నారు. లేకపోతే ఈ పార్టీలకు వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్‌ అరుణ్‌బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ప్రవీణ్‌, జంగాలపల్లి పెద్దన్న, లక్ష్మీనారాయణ, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి గౌతమి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగార్జున, బాబావలి, సిఐటియు నాయకులు శ్రీనివాసులు, సాంబశివ, స్థానిక నాయకులు బ్యాళ్ల అంజి, పైపల్లి గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.