ప్రజాశక్తి - దేవనకొండ
రాయలసీమ అభివృద్ధికి ఐక్యతతో పోరాడాలని రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కోరారు. బుధవారం దేవనకొండలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాయలసీమలోని నాయకుల స్వార్థంతోనే వెనుకబడి ఉందని విమర్శించారు. రాయలసీమకు సాగునీరు అందించడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలో తుంగభద్ర నదిపై 'అప్పర్ భద్ర' ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం వల్ల రాయలసీమకు చుక్కనీరు కూడా రాదన్నారు. జిల్లాలోని సంగమేశ్వరం వద్ద తీగల వంతెన నిర్మాణం చేపట్టడం వల్ల సినిమా షూటింగ్‌కు మాత్రమే పనికి వస్తుందని, రైతులకు ఎలాంటి సాగునీరూ రాదని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోడీ జపం చేస్తున్నారని విమర్శించారు. ఆలూరు నియోజవర్గం నుండి ఎన్నికైన ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పటికీ పశ్చిమ ప్రాంతంలోని పెండింగ్ ప్రాజెక్టుల గురించి అసెంబ్లీలో నాలుగేళ్లలో ఎన్నడూ చర్చించలేదని తెలిపారు. రాయలసీమ అభివృద్ధికి పోరాడే నాయకుని వచ్చే ఎన్నికల్లో గెలిపించుకోవాలని కోరారు. రాయలసీమ స్టీరింగ్ కమిటీ నాయకులు సీమ కృష్ణ, నవీన్ పాల్గొన్నారు.
కార్యక్రమంలో మాట్లాడుతున్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి










