ప్రజాశక్తి-తుని, పిఠాపురం భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కరించాలని కోరుతూ గురువారం తునిలో మంత్రి దాడిశెట్టి రాజా ఇంటి వద్దకు చేపట్టిన రాయబార ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. కార్మికులను, సిఐటియు నాయకులను అరెస్టు చేశారు. పోలీసు స్టేషన్లకు తరలించారు. సిఐటియు నాయకులు చెక్కల రాజకుమార్, నక్కల శ్రీనివాస్, ఎస్‌కె.పద్మ ఆధ్వర్యంలో వందలాదిగా వచ్చిన సిఐటియు నాయకులు, భవన కార్మికులు తుని ఏరియా ప్రభుత్వాసుపత్రి నుంచి ర్యాలీగా బయల్దేరి వెళుతుండగా పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేసి కోటనందూరు, తుని రూరల్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా నాయకులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హక్కులను చట్టాలను కాపాడాలని నినదించారు. శాంతియుతంగా ర్యాలీ చేసి మంత్రికి వినతిపత్రాన్ని అందజేసి కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చేస్తున్న ర్యాలీని అడ్డుకోవడం అన్యాయమన్నారు. కోటనందూరు పోలీస్ స్టేషన్‌కు సుమారు 25 మందిని, నాయకురాలు ఎస్‌కె.పద్మను తరలించగా, అమర్, మరికొంతమందిని ఇతర పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఎపి భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకులను బుధవారం సాయంత్రం, గురువారం తెల్లవారుజామున గృహ నిర్బంధం చేశారు. జిల్లా నలుమూలల నుంచి తుని వస్తున్న కార్మికులను ఎక్కడికక్కడ రహదారులపై నిర్బంధించారు. పోలీసుల వలయాన్ని ఛేదించుకుని తుని రాజా గ్రౌండ్ వద్దకు చేరుకున్న కార్మికులు ర్యాలీగా బయల్దేరడంతో తుని రూరల్ సిఐ సన్యాసిరావు ఆధ్వర్యంలో లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. పోలీసులను తోసుకుని మంత్రి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించగా అరెస్టులు చేసి తుని టౌన్, రూరల్ స్టేషన్, కోటనందూరు, తొండంగి స్టేషన్లకు తరలించారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషబాబ్జిని అరెస్టు చేసి పెదపూడి స్టేషన్‌కు తరలించారు. కాకినాడ నగర అధ్యక్షులు పలివెల వీరబాబును ఇంద్రపాలెం స్టేషన్‌కు తరలించారు. పిఠాపురంలో కుంచే చిన్న, కరణం విశ్వనాథం, గడిగట్ల సత్తిబాబులను ముందస్తు గృహనిర్బంధం చేశారు. అరెస్టులు ఖండిస్తూ సిఐటియు ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రొంగల ఈశ్వరరావు మాట్లాడారు. ప్రభుత్వంపై భారం లేకపోయినా, లేబర్ సెస్ ద్వారా కార్మికులు దాచుకున్న సొమ్ము నుంచి పరిహారాలు చెల్లించకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నాలుగేళ్ల నుండి భవననిర్మాణ కార్మికులకు అన్యాయం చేసిందని విమర్శించారు. దారపురెడ్డి క్రాంతి, మేడిశెట్టి వెంకటరమణ, మాగాపు నాగు, చెక్కల రాజ్‌కుమార్, నక్కెళ్ల శ్రీనులను పోలీసులు సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎపి భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు నిట్ల శ్రీను, ఉపాధ్యక్షుడు డేగల సత్యన్నారాయణ, చింతల సత్యన్నారాయణ, కళ్ల నాగేశ్వరరావు, యు.కొత్తపల్లి సత్యన్నారాయణ, మురారి సూర్యనారాయణ, సురేంద్ర, కామేశ్వరి, తైనాల శ్రీను, గునూరి రమణ, పులగరసెట్టి శ్రీను, బొజ్జా నూకరాజు, కొట్టం రమణ, వైలేటి అప్పారావు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల అరెస్టుకు నిరసనగా ఆందోళన
పెద్దాపురం : మంత్రి దాడిశెట్టి రాజా వద్దకు వెళుతున్న భవన నిర్మాణ కార్మికులను అరెస్టు చేయడానికి నిరసిస్తూ పెద్దాపురం మెయిన్ రోడ్ వినాయకుని గుడి సెంటర్లో సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారన్నారు. సంక్షేమ బోర్డును సాధించేంతవరకు భవన నిర్మాణ కార్మికులు నిర్బంధాలను లెక్కచేయకుండా పోరాటాలు చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నీలపాల సూరిబాబు, సిరపరపు శ్రీనివాస్, యాసలపు రమేష్, టిఎల్.పద్మావతి, స్నేహలత, సావిత్రి, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు తైనాల శ్రీను, గూనూరు వెంకటరమణ, డి.శివ, ముమ్మన నాగు, గడపా వీరబాబు, ఆరు వీర్రాజు, డి.కృష్ణ పాల్గొన్నారు.










