Dec 26,2022 23:21

ప్రజాశక్తి-విజయవాడఅర్బన్‌: మూఢనమ్మకాల నిర్మూలనకై నిర్విరామంగా కృషి చేసిన నిరాడంబరుడు రావూరి అర్జునరావు అని పలువురు కొనియాడారు. రావూరి అర్జునరావు ఆదివారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. సోమవారం ఉదయం నుండి సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని నాస్తిక కేంద్రంలో ఉంచారు. సాయంత్రం నాలుగు గంటలకు కృష్ణలంకలోని విద్యుత్‌ దహనవాటికలోని అంత్యక్రియలు నిర్వహించారు. ఎన్‌టిఆర్‌ జిల్లా కెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు, ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌, రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, వైసిపి విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జి దేవినేని అవినాష్‌తో పాటు నగరంలోని వైద్యులు, లాయర్లు, స్వాతంత్య్ర సమరయోధుల సంఘం సభ్యులు, వయో వృద్దుల సభ్యులు పలు రంగాల ప్రముఖులు అనేక మంది సందర్శించి నివాళులర్పించారు.