
* ప్రతి బీట్ పాయింట్ క్షుణంగా తనిఖీ చేయాలి
* ఎస్‌పి జి.ఆర్ రాధిక
ప్రజాశక్తి - శ్రీకాకుళం: రాత్రివేళలో పకడ్బందీగా గస్తీ నిర్వహించడంతో పాటు ప్రతి బీట్ పాయింట్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేపట్టి నేరాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్‌పి జి.ఆర్ రాధిక బీట్ తనిఖీ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. సోమవారం అర్ధరాత్రి శ్రీకాకుళం నగరంలో గస్తీ తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ రాత్రి గస్తీ విధుల్లో భాగంగా నిరంతరం వాహన తనిఖీలు చేస్తూ, అనుమానిత వ్యక్తులను ప్రశ్నించాలన్నారు. ఎటిఎంలు, బ్యాంకులను తరచుగా తనిఖీ చేస్తూ సెక్యూరిటీని అప్రమత్తం చేస్తూ ఉండాలని చెప్పారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారకు ఎక్కువగా లాడ్జీల్లో ఉండే అవకాశం ఉన్నందున వాటిని తనిఖీ చేయాలన్నారు. కొత్త వ్యక్తులు, అపరిచితుల ఆధార్, వ్యక్తిగత గుర్తింపుకార్డులను పరిశీలించాలని సూచించారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల వద్ద అపరిచిత వ్యక్తుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచి పాయింట్ బుక్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు.