Nov 07,2023 20:43

చెట్లు తొలగింపుతో బోసిపోయిన మెయిన్‌రోడ్డు

ప్రజాశక్తి - పార్వతీపురం టౌన్‌ : పచ్చదనం ప్రగతి మెట్లు... ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి అంటూ పాలకులు, అధికారులు ఒకవైపు ప్రసంగాలు గుప్పిస్తూ, పెద్దమొత్తంలో ప్రజాధనం ఖర్చు చేస్తుండగా... మరో వైపున ఉన్న మొక్కలు, చెట్లును నరికేస్తున్నారు. అధికారులు ఎందుకు ఇలా చేస్తున్నారో ఎవరికీ అంతుపట్టక తలలు పట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితే పట్టణంలో చోటు చేసుకుంది.
పట్టణ ప్రధాన రహదారి మధ్యలో గల డివైడర్‌పై ఉన్న మొక్కలను, చెట్లును సోమవారం నాడు రాత్రికి రాత్రే మున్సిపల్‌ అధికారులు సిబ్బందితో నరికి వేయడంతో ఎవరి మెప్పు కోసం ఈ పనులు చేపట్టారు, ఇంత అర్ధాంతంగా పచ్చని చెట్లు పై కత్తి వేటు వేయడం ఏమిటని రహదారికి వైపులా ఉన్న వ్యాపారులతో పాటు పట్టణ ప్రజల బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. మొక్కలను పెంచి భావితరాల మనుగడ కొరకు ప్రాణవాయువును అందించాలని, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలతో పాటు ప్రపంచమంతా ప్రచారం చేస్తుంది. ఏ గోడపై చూసిన ఇలాంటి ప్రచార రాతలు కనబడుతూనే ఉంటాయి. ప్రధాన రహదారి మధ్యలో డివైడర్‌పై ఉన్న పచ్చని మొక్కలను గత ప్రభుత్వ హయాంలో ఏర్పడిన మునిసిపల్‌ పాలకవర్గం అనుమతితో పట్టణ సుందరీకరణతో పాటు కాలుష్య నియంత్రణ కొరకు లక్షలాది రూపాయల నిధులను వెచ్చించి మున్సిపల్‌ అధికారులు మొక్కలు నాటించారు. అవి చెట్లుగా పెరిగాయి. వాటిని మళ్లీ మున్సిపల్‌ అధికారులే దగ్గర ఉండి నరికించి వేసి పచ్చనదనానికి తూట్లు పొడవడం గమనార్హం.
ప్రజారోగ్యానికి మంచిదికాదనే తొలగించాం : కమిషనర్‌
ఈ విషయమై ప్రజాశక్తి మున్సిపల్‌ కమిషనర్‌ జె.రామఅప్పలనాయుడును వివరణ కోరగా, డివైడర్‌ మధ్యలో ఉన్న మొక్కలు కొనోకార్పస్‌ వృక్ష జాతికి చెందినవని, వీటి ద్వారా వచ్చే గాలి, పువ్వలు, పుప్పొడి ప్రజల ఆరోగ్యానికి మంచివి కాదని, ఈ మొక్కలను గుజరాత్‌ ప్రభుత్వం నిషేధించిందని, డివైడర్‌పై ఉన్న వీటిని దశలవారీగా తొలగించి వాటి స్థానంలో ప్రజల ఆరోగ్యానికి ఉపయోగపడే మంచి మొక్కలను నాటి డివైడర్‌పై గ్రిల్స్‌ ఏర్పాటు చేస్తునట్టు తెలిపారు. ఇందుకు సాధారణ నిధులు నుంచి రూ.5 లక్షలు ఖర్చు చేసేందుకు పాలకవర్గం కౌన్సిల్‌ సభ్యుల ముందస్తు ఆమోదం కోరడం జరిగిందని, పనులను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. ఎప్పటిలోగా ఈ పనులను అధికారులు ప్రారంభిస్తారో చూడాలి మరి.
మొక్కలు తొలగించడం సరికాదు
పట్టణంలోని ప్రధాన రహదారి మధ్యలో ఉన్న డివైడర్‌పై ఏడేళ్ల క్రితం నాటిన మొక్కలు ఇప్పుడు తొలగించడం సరికాదని మాజీ ఎమ్మెల్సీ ద్వారపూడి జగదీష్‌, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ ద్వారపురడ్డి శ్రీదేవి మున్సిపల్‌ కమిషనర్‌తో అన్నారు. జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి మొక్కలు తొలగించడంతో మంగళవారం నాడు టిడిపి ఎమ్మెల్సీ, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌, టిడిపి కౌన్సిల్‌ సభ్యులు నాయకులతో కలిసి డివైడర్‌ లో మొక్కలు తొలగించిన ప్రాంతాన్ని పరిశీలించి, అనంతరం మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లి కమిషనర్‌ జె.రామ అప్పలనాయుడును మొక్కలను అర్ధాంతరంగా ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. కమిషనర్‌ మాట్లాడుతూ ఈ మొక్కల వల్ల ప్రజలు అనారోగ్య సమస్యలు గురయ్యే అవకాశం ఉందని, దీం దృష్టిలో ఉంచుకొని తొలగిస్తున్నట్టు తెలిపారు. ఈ మొక్కల స్థానంలో పర్యావరాణానికి ఉపయోగపడే మొక్కలు నాటుతామన్నారు. కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షులు జి.రవికుమార్‌, కౌన్సిలర్‌ నారాయణరావు, మండల అధ్యక్షులు గొట్టాపు వెంకటనాయుడు, మాజీ కౌన్సిలర్‌ పాలకొండ మరియదాసు, తదితరులు పాల్గొన్నారు