Oct 04,2023 19:11

ప్రజాశక్తి - ఆచంట
నవంబర్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి వాలీబాల్‌ జట్టుకు కొడమంచిలి హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న పులిదిండి సురేష్‌కుమార్‌ ఎంపికైనట్లు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు చిరంజీవి తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచుల ఛాంబర్‌ మండల అధ్యక్షులు సుంకర సీతారామ్‌ మాట్లాడారు. ఈ నెల 29వ తేదీన పెదతాడేపల్లిలోని భారతీయ విద్యా భవన్స్‌లో నిర్వహించిన ఎస్‌జిఎఫ్‌ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వాలీబాల్‌ సెలెక్టన్స్‌లో అండర్‌ -14 విభాగంలో రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికయ్యారని తెలిపారు. ప్రతి సంవత్సరమూ రాష్ట్రస్థాయి వాలీబాల్‌ జట్టుకు కొడమంచిలి స్కూల్‌ నుంచి విద్యార్థులు ఎంపికవ్వడం అభినందనీయమన్నారు. రాష్ట్ర స్థాయిలో జరిగే వాలీబాల్‌ పోటీల్లో విద్యార్థి రాణించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్న పీడీ చిరంజీవిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ, ఉపాధ్యాయులు శ్రీనివాస్‌, రమణారావు, పోలిశెట్టి వనమారాజు తదితరులు సురేష్‌ కుమార్‌ను అభినందించారు.