ప్రజాశక్తి - బాపట్ల
యూనిసెఫ్ 2023-24 విద్యా సంవత్సరంలో నిర్వహించిన స్కూలు ఇన్నోవేషన్స్ ప్రోగ్రాంలో బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం అడవులదీవి జెడ్‌పి ఉన్నత పాఠశాల విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచారని జిల్లా సైన్స్ అధికారి ఎండి సాదిక్ విలేకరులకు ఆదివారం తెలిపారు. రాష్ట్రంలో 26జిల్లాల నుండి వివిధ అంశాలపై ఎంపికైన 27 సైన్స్ ప్రాజెక్టులను ఈనెల 28 నుండి 30 వరకు రాష్ట్రస్థాయిలో విజయవాడలో జరిగే ఇన్నోవేషన్స్ ఎంపిక కార్యక్రమంలో రాష్ట్రస్థాయి విజేతలను ఎంపిక చేస్తారని తెలిపారు. అయితే అడవులదీవి జెడ్‌పి ఉన్నత పాఠశాల విద్యార్థులు సాధారణంగా వినియోగించే గొడుగునకు లోపల చల్లని గాలి వీచే విధంగా సోలార్ ప్యానల్స్, డిసి బ్యాటరీ శక్తితో ఫ్యాన్లు అమర్చారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన అడవులదీవి జెడ్‌పి ఉన్నత పాఠశాల విద్యార్థులను డిఇఒ పివిజె రామారావు, డిప్యూటి డిఇఒ జి వెంకటేశ్వర్లు, హెచ్‌ఎం ఎం జోత్స్న అభినందించారు.










