Dec 31,2022 00:16

హాకీ క్రీడాకారులతో ప్రిన్సిపల్‌, హెచ్‌ఎం, చైర్మన్‌ తదితరులు

ప్రజాశక్తి-నక్కపల్లి :నక్కపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మైదానంలో శుక్రవారం స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర స్థాయి అండర్‌ -19 బాల, బాలికల హాకీ పోటీలు ఎంతో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. 13 ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చిన హాకీ క్రీడాకారులు శుక్రవారం ఫ్లాగ్‌ మార్చ్‌ చేశారు. మూడు రోజులపాటు ఈ పోటీలు జరగనున్నాయి. బలిరెడ్డి సత్యవతి హాకీ క్లబ్‌ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి పోటీలకు సంబంధించిన ఏర్పాట్లను చేశారు. స్పోర్ట్స్‌ అథారిటీ అధికారి నగిరెడ్డి సూర్యారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ తోట నగేశ్‌, ఎంపీపీ ఏనుగుపల్లి రత్నం, జడ్పీటీసీ సభ్యురాలు గోసల కాసులమ్మ, వైస్‌ ఎంపీపీలు వీసం నానాజీ, వెలగా ఈశ్వరరావు, సర్పంచ్‌ నేతల జయ రత్నకుమారి, తదితరులు క్రీడాకారులను పరిచయం చేసుకుని ఈ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నగిరెడ్డి సూర్యారావు మాట్లాడుతూ, నక్కపల్లిలో హాకీ క్రీడాకారులు నిరంతరం సాధన చేయడంతో అనేక మంచి ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు. హాకీ క్రీడాభివృద్ధికి తన సహకారం పూర్తిగా ఉంటుందన్నారు. తోట నగేశ్‌ మాట్లాడుతూ, నక్కపల్లిలో హాకీ అకాడమీని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నక్కపల్లి జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ శైలజ, హైస్కూల్‌ ఇన్ఛార్జి హెచ్‌ఎం అప్పారావు, స్కూల్‌ కమిటీ చైర్మన్‌ పద్మ, అనకాపల్లి జిల్లా అండర్‌-19 స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ కన్వీనర్‌ రాంబాబు, నక్కపల్లి బీఎస్‌ హాకీ క్లబ్‌ వ్యవస్థాపకులు బలిరెడ్డి సూరిబాబు, కార్యదర్శి తాతాజీ, హైస్కూల్‌ పీడీ కుందూరురాజు, జాతీయ హాకీ క్రీడాకారులు పీటర్‌, సీఎస్‌ రాజు, టీడీపీ నాయకులు కేవీ సత్యనారాయణ, మీగడ సత్తిబాబు, కోసూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.