
రాష్ట్రంలోనే వైసిపి, టిడిపి పులులు.. మోడీ వద్ద గ్రామ సింహాలు
- నంద్యాల బహిరంగ సభలో ఎం ఏ.గఫూర్
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
వైసిపి, టిడిపిలు రాష్ట్రంలో సింహాలు, పులులు, మోడీ దగ్గర గ్రామ సింహాలు, పిల్లులు అని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ. గఫూర్ విమర్శించారు. సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజారక్షణ భేరి బస్సుయాత్ర మంగళవారం నంద్యాల పట్టణంలోకి ప్రవేశించింది. నంద్యాల జివి మాల్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎంఏ.గఫూర్ మాట్లాడారు. ప్రధాని మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్నదమ్ముళ్లాగా ఉండే ప్రజల మధ్య మత చిచ్చి పెట్టి లబ్ధిపొందాలని చూస్తుందన్నారు. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగం, దారిద్య్రం పెరిగి పోయిందన్నారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం మతాల పేరుతో ప్రజల మధ్య తగదాలు సష్టిస్తుందని, ప్రజలు ఐక్యంగా ఉండటం మోడీకి ఇష్టం లేదని విమర్శించారు. వారు ఐక్యంగా ఉంటే తమ ఆటలు సాగవని, అందుకే ప్రజల్లో మత చిచ్చు పెడుతున్నారన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి , చంద్రబాబు నాయుడు సిఎం సీటు కోసం కొట్లాడుతున్నారు తప్ప ప్రజా సంక్షేమం కోసం కాదని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్కీమ్ వర్కర్లకు సంక్షేమ పథకాలను వర్తింపజేయడం లేదని, రూ.పదివేలతో స్కీం వర్కర్లు ఎలా బతకుతారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రూ.10 వేలతో ఒక నెల బతకగలరా అని నిలదీశారు. నంద్యాల ప్రాంతంలో నీటి వనరులు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు అసమర్థత వల్ల ఉపయోగించుకోలేక పోతున్నారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర విభజన సందర్భంగా హైదరాబాద్ ప్రభుత్వ భవనాల నుండి రూ.500 కోట్ల పైగా ఎపికి రావాల్సి వాటా కెసిఆర్‌కు దారదాత్తం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర నాయకులు మామహేశ్వర రావు మాట్లాడుతూ ప్రజలు రాష్ట్రంలో అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ద చూపడం లేదన్నారు. కార్మికుల హక్కులను పరిరక్షించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయన్నారు. మోడీ ప్రజా వ్యతిరేక విధానాలపైన సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్ కుమార్ విమర్శించారు. అంబాని, ఆదానిలకు ప్రధాని నరేంద్ర మోడీ దేశ సంపదను దోచిపెడుతున్నారన్నారు. సిపిఎం రాష్ట్ర నాయకులు దయా రమాదేవి మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. బేటి బచావో బేటి పడావో అన్న నినాదం నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఆకర్షణీయంగా మారిందని విమర్శించారు. సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు మహమ్మద్ గౌస్ అధ్యక్షత వహించగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎ.నాగరాజు, పట్టణ నాయకులు టి.మద్దులు, డి.లక్ష్మణ్, ఎస్.మస్తాన్ వలి, జిల్లా నాయకులు శివరాం, రత్నమయ్య శ్రీనివాసమూర్తి రామరాజు షేభారాణి పాల్గొన్నారు.